తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. దేశ‌వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ ఎన్నిక‌ల్లో అటు అధికార టీఆర్ఎస్‌, ఇటు విప‌క్ష కాంగ్రెస్ నుంచి మ‌హామ‌హులు మ‌ట్టి క‌రిచారు. అధికార టీఆర్ఎస్ నుంచి ఏకంగా న‌లుగురు మంత్రులు ఓడిపోయారు. ఖమ్మం జిల్లాలో సీనియర్‌ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఓటమిపాలయ్యారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలవ్వడం గమనార్హం. కొల్లాపూర్‌లో మరో సీనియర్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ములుగులో అజ్మీరా చందూలాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీతక్క చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 


తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి ఓటమి తప్పలేదు. ఆయ‌న‌పై కాంగ్రెస్ అభ్య‌ర్థి ఫైలెట్ రోహిత్‌రెడ్డి గెలిచారు. ఇక తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారికి ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి గెలిచారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో అదిరిపోయే ట్విస్ట్ జ‌రిగింది. ఎన్నిక‌ల సంగ్రామంలో త‌ల‌ప‌డ్డ అన్నదమ్ములలో అన్నలు ఓటమి పాలవ్వగా.. తమ్ముళ్లు గెలిచారు. పట్నం బ్రదర్స్‌లో మహేందర్ రెడ్డి ఓటమి చెందగా.. ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి గెలుపొందారు. తాండూరు నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌స్తోన్న మ‌హేంద‌ర్‌రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు.


ఇక ఆయ‌న సోద‌రుడు కొడంగ‌ల్‌లో గెలిచారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిపై నరేందర్ రెడ్డి విజయం సాధించి సంచలనం సృష్టించారు. మల్లు సోదరుల్లో రవి ఓటమి పాలుకాగా, మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. జ‌డ్చ‌ర్ల‌లో తాజా మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి చేతిలో మ‌ల్లు ర‌వి ఓడిపోయారు. ఆయ‌న సోద‌రుడు ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌లో గ‌ట్టి పోటీ ఎదుర్కొని విజ‌యం సాధించారు. మ‌ధిర‌లో భ‌ట్టికి ఇది వ‌రుస‌గా మూడో గెలుపు. దీంతో అక్క‌డ ఆయ‌న హ్యాట్రిక్ కొట్టిన‌ట్ల‌య్యింది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌లో వెంకట్ రెడ్డి ఓడిపోగా.. రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. రాజ్‌గోపాల్‌రెడ్డి మునుగోడులో విజ‌యం సాధిస్తే, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట‌రెడ్డి జిల్లా కేంద్ర‌మైన న‌ల్ల‌గొండ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: