తెలంగాణ ఆపధర్మ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత తానేంటో మరో సారి ఫ్రూవ్‌ చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న కవిత గత రెండు మూడేళ్లుగా జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఒక్క జగిత్యాలలో మాత్రమే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జీవ‌న్‌రెడ్డి విజయం సాధించారు. మిగిలిన 12 సీట్లు టీఆర్‌ఎస్‌ కైవశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా జీవన్‌రెడ్డిని ఓడించాలని పంతం వేసిన కవిత గత మూడేళ్లుగానే ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఒకానొక దశలో ఆమె ఈ ఎన్నికల్లో జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే కవిత మాత్రం గత ఎన్నికల్లో అక్కడ ఓడిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కే మరో సారి సీటు ఇప్పించుకున్నారు. 


అసలు జగిత్యాల నియోజకవర్గం అంటేనే రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి, టీడీపీ నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్‌. రమణ హవానే కొనసాగేది. జగిత్యాలో ఇప్పటి వరకు వీరిద్దరే ఏకచక్రాధిపత్యంగా రాజకీయాలను శాశించారు.  అలాంటిది ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడంతో వీరిద్దరూ కలిసి ప్రచారం చెయ్యడంతో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ తప్పదని అందరూ అనుకున్నారు. పైగా ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి కోసం ఎల్‌. రమణ తన సీటును సైతం త్యాగం చేశారు. జీవన్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం కూడా చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతగా ఉన్న జీవన్‌రెడ్డిని ఓడించేందుకు కవిత ప్రత్యేక వ్యూహం పన్నారు. మూడు సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీని వెనక కవిత వ్యూహం కూడా వేరేగా ఉంది. కవిత ఎంపీగా ఉన్న నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌ వస్తోంది. 


ఈ క్రమంలోనే ఇక్కడ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు మరింత మెజారిటీ వస్తుందన్న ప్లాన్‌తో ఆమె ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి పెట్టారు. కవిత పంతం వేసి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు సీటు ఇప్పించుకోవడంతో పాటు ఆయన గెలుపు కోసం అక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. తాజాగా ఎన్నికల ఫలితాల్లో జగిత్యాలలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ సంజయ్‌ జీవన్‌ రెడ్డిపై ఏకంగా 30,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ క్రెడిట్‌ మొత్తం కల్వకుంట్ల కవితకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఓ వైపు హేమా హేమీలు అయిన జీవన్‌రెడ్డి, ఎల్‌. రమణ ఇక్కడ కూటమి జెండాను ఎగరవేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్లాన్లు అన్నీ కవిత వ్యూహాల ముందు చిత్తు అయ్యాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో జగిత్యాలలో సంజయ్‌ను గెలిపించుకుని టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడేలా చెయ్యడంలో కవితదే అసలు సిసలైన విజయం అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: