తెలంగాణ లో జరిగిన ముందస్తు శాసన సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మ‌రోసారి తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించింది. కారు జోరుకు కూటమి సహా ఇతర పార్టీలు కుదేలయ్యాయి . 119 స్థానాలకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 83 స్థానాలో విజయం సాధించి రెండో సారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కారు పార్టీ మొత్తం 87 స్థానాల‌కు ద‌గ్గ‌ర‌వుతోంది. ఈ ఎన్నిక‌ల్లో టాలీవుడ్‌కు చెందిన కొంద‌రు సినీ ప్ర‌ముఖులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అయితే వారికి షాకులు త‌ప్ప‌లేదు. వారంతా ఓడిపోయారు.


ఇక ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత భవ్య క్రియేషన్స్ అధినేత భ‌వ్య ఆనంద్ ప్రసాద్ టీడీపీ పార్టీ తరుపున శేరిలింగంపల్లి నియోజిక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. బాల‌య్య‌తో ఆయ‌న‌కు ఉన్న సంబంధాల నేప‌థ్యంలో బాల‌య్య ద్వారా ఒత్తిడి చేసి మ‌రీ ఆయ‌న ఈ సీటును ద‌క్కించుకున్నార‌న్న టాక్ ఉంది. ఆయ‌న ప్ర‌చారం కోసం బాల‌య్య‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ రోడ్ షోలు చేసినా ఆనంద్ ప్ర‌సాద్ మాత్రం టీఆర్ఎస్ అభ్య‌ర్థి అయిన తాజా మాజీ ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ చేతిలో ఓడిపోయారు.


అలాగే ఆందోల్‌ నుంచి ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు బాబూమోహ‌న్ ఓడిపోయారు. ఆయ‌న మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే కేసీఆర్ ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌లేదు. దీంతో తీవ్ర అవ‌మానంగా భావించిన ఆయ‌న బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఆందోల్‌లో పోటీ చేశారు. ఇక్క‌డ ఆయ‌న‌కు మూడో స్థాన‌మే ద‌క్కింది. అలాగే ఈ రోజుల్లో లాంటి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన వ‌ర్థ‌మాన న‌టి రేష్మ రాథోడ్ ఖ‌మ్మం జిల్లా వైరా నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైరాలో ఇండిపెండెంట్ అభ్య‌ర్థి లావుడ్యా రాములూ నాయ‌క్ విజ‌యం సాధించారు.


వీరితో పాటు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల సోదరి నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుండి పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు. సుహాసిని విజ‌యం కోసం చంద్ర‌బాబు, బాల‌య్య‌తో పాటు ఏపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేసినా ఫ‌లితం లేక‌పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: