కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర‌ప‌డిన‌,  మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రించి ఖ‌మ్మం జిల్లాపై ప‌ట్టు సాధించిన మాజీ మంత్రి, తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల ఆది నుంచి పోటీ ఇచ్చారు. అయితే, ఇక్క‌డ ఆయ‌న స్థానికుడు కాక‌పోవ‌డం, కాంగ్రెస్ నుంచి బ‌రిలో నిలిచిన కందాల ఉపేంద‌ర్ రెడ్డి గ‌ట్టిపోటీ ఇవ్వ‌డంతో తుమ్మ‌ల అడ్ర‌స్ గ‌ల్లంతైంది. పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున తుమ్మల, ప్రజాకూటమి తరపున కందాల ఉపేందర్ రెడ్డి, బీజేపీ నుంచి కొండవల్లి శ్రీధర్ రెడ్డి, సీపీఎం అభ్యర్థి బత్తుల హైమావతి పోటీ చేశారు. పాలేరు నియోజవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు పాలేరు నియోజకవర్గంలో మంచి పట్టున్నా, సీనియర్ నేత తుమ్మలను బరిలోకి దింపినా.. కాంగ్రెస్ అభ్యర్థి ధీటుగా ఎదుర్కొన్నారు. 


చివ‌ర‌కు 6 వేల ఓట్ల తేడాతో తుమ్మ‌ల ఓడిపోయారు. 2014లోనూ టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు పరాజయం పాలయ్యారు. అనూహ్యంగా కేసీఆర్ నుంచి ఆఫర్ రావడంతో.. జిల్లా అభివృద్ది కోసమంటూ ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఆ వెంటనే మంత్రి పదవిని చేపట్టారు. అనూహ్యంగా కాంగ్రెస్ నేత రాం రెడ్డి వెంటక రెడ్డి మరణంతో.. వచ్చిన ఉప ఎన్నికల్లో తుమ్మల పోటీ చేశారు. సెంటిమెంట్‌ను కాదని మరీ ప్రజలు తుమ్మలను గెలిపించారు. ఆ ఎన్నికల్లో 45,682 ఓట్ల మెజారిటీతో తుమ్మల ఘన విజయం సాధించారు. కాగా.. ఈ ఎన్నికల్లో తాను అసలు పోటీ చేయదలచుకోలేదని ప్రచారంలో ఉండగానే తుమ్మల వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుందామనుకున్నానని ప్రచారం సందర్భంగా తెలిపారు. ఓడిపోతే.. వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని కూడా వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒత్తిడితోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. 


ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను అత్యధిక నియోజకవర్గాల్లో గెలిపించడమే థ్యేయంగా పెట్టుకున్నానన్నారు. పాలేరులోనే తుమ్మ‌ల‌కు గ‌ట్టి పోటీ ఎదురు కావ‌డంతో జిల్లా అంత‌టా టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాల్సిన తుమ్మ‌ల చివ‌ర‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మైపోయారు. అయితే, తీరా ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. తుమ్మ‌ల రాజ‌కీయం ఏంటో కేసీఆర్‌కు అర్ధ‌మైంది. ఇక్క‌డ నుంచి టీఆర్ ఎస్ కేవ‌లం ఒక్క‌చోట మాత్రంమే విజ‌యం సాధించింది. ఇదే విష‌యాన్ని తాజాగా నిర్వ‌హించిన మీడియా మీటింగ్‌లో ప్ర‌స్తావించిన కేసీఆర్‌..  ఖ‌మ్మంలో కొంద‌రు చేసిన  ప‌నుల‌తో తాము కేవ‌లం ఒక్క‌సీటుకే ప‌రిమితం అయ్యామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు, మా వాళ్లు స‌రైనోళ్లు అయితే.. ఖ‌మ్మంలో క్లీన్ స్వీప్ చేయ‌క‌పోదుమా? అన్నారు. అంటే.. దీనిని బ‌ట్టికేసీఆర్ స‌మీప భ‌విష్య‌త్తులో తుమ్మ‌ల‌కు షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఆయ‌నకు పార్టీలో ఉన్న ప‌ద‌వుల‌ను త‌గ్గించ‌డ‌మో.. లేదా.. మ‌రొక‌రికి అప్ప‌గించ‌డమో చేయొచ్చ‌ని అంద‌రూ భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: