రాజకీయాల్లో అపర చాణక్యుడు చంద్రబాబు అంటారు. ఆయన రాజకీయం చేస్తే అలా ఇలా ఉండదని ప్రత్యర్ధికి చుక్కుల కనిపించాల్సిందేనని కూడా అనుచరులు చెబుతూంటారు. . మరి బాబు తాజాగా వేసిన ఎత్తుగడ తెలంగాణాలో తుస్సుమంది. ప్రజా కూటమి పేరు చెప్పి కాంగ్రెస్ తో చేసిన దోస్తుకు జనం నో చెప్పేశారు. మరి ఏపీలో సంగతేంటి.


ఒంటరిగానేనా :


ఏపీలో పొత్తుల విషయం ఇపుడు టీడీపీలో సెగలు రేపేలా ఉంది. జాతీయ స్థాయిలో అవసరాలు, ప్రత్యేక హోదా వంటి కారణాలు చెప్పి ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ అంటకాగితే జనాలు ఆదరించడం దేముడెరుగు ముందుగా తమ్ముళ్ళే తలంటేలా ఉన్నారు. తెలంగాణాలో పొత్తు పెటాకులు కావడానికి అది అనైతికం కావడమే కారణమని కూడా అంటున్నారు. దీంతో ఒంటరిగానే పోటీకి రెడీ అయితేనే మంచిదని కూడా పార్టీలోని నాయకుల మాటగా ఉంది.


జగన్ కి అస్త్రం:


అలా కాకుండా ఏపీలో కూడా పొత్తుల పేరుతో కాంగ్రెస్ తో జత కడితే అది జగన్ చేతికి బ్రహ్మాస్త్రం అందించినట్లవుతుందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే జగన్ తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ పొత్తులపై జనంలోకి వెళ్ళి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ జనం ఆ పొత్తులను ఓడించారని, ఇక్కడా ఓడించాలని కూడా పిలుపు ఇస్తున్నారు.  అందువల్ల ఏపీలో ఇపుడున్న పరిస్తితుల్లో  పొత్తులు ఉంటాయా అన్నది టీడీపీలో  పెద్ద ప్రశ్నగానే ఉంది. 

అయితే బీజేపీకి వ్యతిరేకంగా   జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కూటమి కోసం ఓ వైపు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధితో కలసి ఆయన ఇతర పార్టీలతో భేటీలు అవుతున్నారు. ఈ టైంలో ఏపీలో పొత్తు పెట్టుకోకుండా ముందుకు వెళ్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి. కాంగ్రెస్  ఎలా రిసీవ్ చేసుకుంటుందన్నది కూడా చూడాల్సితుంది. మొత్తం మీద కాంగ్రెస్ తో పొత్తు విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నాయకుల్లో మాత్రం మెజారిటీ ఒంటరి పోరే బెటర్ అంటున్నట్లు టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: