తెలంగాణా ఎన్నిక‌లు ముగిశాయి. భారీ మెజారిటీతో అధికార టీఆర్ ఎస్ పార్టీ విజ‌యం సాధించింది. పార్టీ అధినేత కేసీఆర్‌.. ఆయ‌న కుమారుడు కూటీఆర్‌.. మేన‌ల్లుడు హ‌రీష్‌రావులు కూడా విజ‌యం సాధించారు. దాదాపు 88 స్థానాల్లో పార్టీ విజ‌యం సాదించింది. తిరిగి నేడో రేపో.. సీఎం కుర్చీ కూడా ఎక్క‌బోతున్నారు. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం.. అయితే, నిజంగానే కేసీఆర్ గెలిచారా? ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు చేసిన వ్యాఖ్య‌ల మేర‌కు ఆయ‌న విజ‌యం సాధించిన‌ట్టేనా? స‌ంఖ్యా బ‌లంగా చూసుకున్న‌ప్పుడు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అక్క‌ర‌లేద‌ని అనిపిస్తుంది. కానీ, నైతికంగా చూసుకున్న‌ప్పుడు మాత్రం కేసీఆర్ ఆశించిన మేర‌కు విజ‌యం సాధించ‌లేద‌నేది క‌నిపిస్తుంది. ఆయ‌న తెలంగాణాలో అస‌లు ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌నుకున్నారు. 


కానీ, అది పార‌లేదు. కీల‌క‌మైన మంత్రుల‌ను గెలిపించుకోలేక పోయారు. అదేవిధంగా కాంగ్రెస్ ను క‌ట్ట‌డి చేయ‌లేక పోయారు. ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ చేసిన కీల‌క వ్యాఖ్య‌ల్లో.. 119వ నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి చెబుతున్నా 110 పైగా స్థానాలు గెలిచి తీరుతాం. అనేది ప్ర‌ధాన‌మైంది. మ‌రో సంద‌ర్భంలోనూ.. సెంచరీ కొడతాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా వందకు పైగా స్థానాలు గెలుస్తాం- అని నొక్కి వ‌క్కాణించారు. కానీ వాస్త‌వంలోకి వ‌స్తే.. 88 సీట్ల‌తోనే కేసీఆర్ స‌రిపుచ్చుకోవాల్సి వ‌చ్చింది. దీనిని ఆయ‌న లైట్‌గా తీసుకుని ఉండొచ్చు! కానీ, అంత‌ర్గ‌తంగా మాత్రం దీనిపై చాలానే చ‌ర్చ సాగింది. కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చేయ‌డంతోనే కేసీఆర్ స‌రిపుచ్చుకోవాల‌ని అనుకుని ఉండే ఆ విధంగా 100, 110 స్థానాలు అంటూ భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు చేసే వారు కాదు. 


నిజానికి ఆయ‌న ఎన్నికల‌కు వెళ్లిన ఉద్దేశాన్ని చూస్తే.. త‌మ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని, కోర్టుల‌కు వెళ్తోంద‌ని ప‌థ‌కాలు ఆగిపోతాయ‌ని, కాబ‌ట్టి రాష్ట్రంలో ఉంటే మేమా.. లేక కాంగ్రెసా?  ఏదో ఒక‌టి మాత్ర‌మే ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నిక‌ల‌కు వెళ్లారు. త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. త‌ను చేప‌ట్టిన ప‌థ‌కాలు కూడా విజ‌యం సాధిస్తాయ‌న్నారు. ఇప్పుడు తీరా ఫ‌లితం చూశాక సంఖ్యా ప‌రంగా కేసీఆర్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినా.. ఎన్నిక‌ల‌కు వెళ్లిన నాటి ప‌రిస్థితిని గ‌నుక మ‌నం విశ్లేషిస్తే.. ఆయ‌న నైతికంగా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు.

మ‌రోరూపంలో చెప్పాలంటే.. ఆయ‌న మంత్రులు న‌లుగురు ఓట‌మి పాల‌య్యారు. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారే విజ‌యం సాధించ‌లేదు. ఓటింగ్ శాతం కూడా ఆశించిన విధంగా రాలేదు. అనూహ్య‌మైన ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏదేమైనా సంఖ్యా బ‌లం ఉంది. కానీ, కేసీఆర్ కోరుకున్న‌ట్టు కాంగ్రెస్ మ‌ళ్లీ బ‌లోపేతం కాలేదు కానీ.. గ‌త ఎన్నిక‌ల్లో 21 మంది ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు 19కి త‌గ్గారు. అంతే!! 



మరింత సమాచారం తెలుసుకోండి: