నాలుగున్నరేళ్ల కిందట మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తూ వస్తోంది.. కొన్నిచోట్ల సొంతబలంతో.. మరికొన్ని చోట్ల విపక్షాల మెడలు వంచి దారికి తెచ్చుకుని ముఖ్యమంత్రి పీఠాలను అధిష్టించింది. అయితే తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి తీరని పరాభవాన్ని మిగిల్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మరో ఆరు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం అందని ద్రాక్షగా మిగులుతుందేమోననే బెంగ పట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ అండతో గతంలో కంటే కాస్తోకూస్తో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తామని భావించిన బీజేపీకి కన్నీళ్లే మిగిలాయి.


తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 118 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అయితే ఒక్క సీటు మాత్రమే గెలిచింది. కనీసం 10 సీట్లలో అయినా విజయం ఖాయమని ఆ పార్టీ అంచనా వేసింది. ప్రధాని మోడీ నుంచి బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం చేసినా కమలాన్ని గట్టెక్కించలేకపోయారు. కనీసం సిట్టింగ్ స్థానాలను కూడా బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. కనీసం కింగ్ మేకర్ గా అవతరిద్దామనుకున్న బీజేపీ సింగిల్ సీట్ కే పరిమితమైంది. 
2014లో ఐదుచోట్ల గెలిచిన బీజేపీ అభ్యర్థులు ఈసారి కేవలం ఒక్కటంటే ఒక్కస్థానానికే పరిమితమయ్యారు. ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఓటమి పాలయ్యారు. అంబర్ పేట్ లో తిరుగులేని నేతగా ఉన్న కిషన్ రెడ్డి కూడా కారు జోరును అడ్డుకోలేకపోయారు. బీజేపీకి పట్టున్న ఖైరతాబాద్, ఉప్పల్ నియోజకవర్గాల్లోనూ ఓటమి తప్పలేదు. సిట్టింగ్ లనే నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ.. ఇతర స్థానాల్లో తుడిచిపెట్టుకుపోయింది. మోడీ మార్క్ తో మరోసారి గట్టెక్కేద్దామని బీజేపీ భావించినా అది సాధ్యపడలేదు. 


118 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కనీసం 20 నుంచి 30 స్థానాల్లో గెలవొచ్చని కమలనాథులు భావించారు. ఇటో అటో అయితే కింగ్ మేకర్ కావొచ్చన్న కలలూ కన్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. కింగ్ మేకర్ కావాలన్న లక్ష్యం బాగానే ఉన్నా.. ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంలో మాత్రం బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో  కమలం ప్రభావం  చూపకపోవడానికి టీఆర్ఎస్ ప్రభంజనం ఒక కారణమైతే.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సరిగా ప్రమోట్ చేసుకోకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. మరోవైపు  కేంద్రం నుంచి సరైన నిధులు రాకపోవడం కూడా పెద్ద లోపంగా మారింది. తెలంగాణకు స్మార్ట్ సిటీలు, ప్రధాన మంత్రి ఇళ్లు, హైవేలు, ఎయిమ్స్ వంటి సంస్థలను కేటాయించినా.. వాటిని సరిగా ప్రమోట్ చేసుకోవడంలో రాష్ట్ర బీజేపీ విఫలమైంది. స్మార్ట్ సిటీల పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో పట్టణ ప్రజల్లో బీజేపీపై విశ్వసనీయత పోయింది. 


తెలంగాణలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నా ప్రధాని మోడీనే విద్యుత్ కష్టాలున్నాయంటూ విమర్శలు చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మోడీ వ్యాఖ్యలు తిప్పికొట్టడంలోనూ.., వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి క్యాష్ చేసుకోవడంలో కేసీఆర్ విజయవంతమయ్యారు. 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు చివరికంటా బీజేపీలో ఉన్నా.. క్యాడర్ ను మాత్రం కాపాడుకోలేకపోయారన్న విమర్శలూ ఉన్నాయి. ఇది కూడా బీజేపీ  వైఫల్యంగా విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ తరపున మాస్ లీడర్లు లేకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్న వారి పాపులారిటీ కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైంది. దీంతో ప్రచారం కోసం ప్రధాని మోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పైనే ఆధారాపడాల్సి వచ్చింది. స్టార్ క్యాంపెనర్ గా వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రభావం చూపలేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: