తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రులకు డిల్లీ మోజు ఎక్కువగానే ఉంది. ముందు తమ రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న  ఉబలాటం బాగా కనిపిస్తోంది.  చంద్రబాబు గతంలో జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. మళ్ళీ ఇపుడు ఆయన మరో మారు కీలకంగా  ఉంటున్నారు. ఇక కేసీయార్ రెండవమారు తెలంగాణా సీఎం అయ్యారు. ఆయన సైతం జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.


ఫెడరల్ ఫ్రంట్ తో:


కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మరో మారు జాతీయ స్థాయిలో ముందుకుపోవలనుకుంటున్నారు. తెలంగాణాలో విజయం సాధించిన మరు క్షణం ఆయన నోట ఫ్రంట్ మాట వినిపించింది. కాంగ్రెస్, బీజేపీ లేని ఫ్రంట్ కావాలని ఆయన అంటున్నారు. ప్రాతీయ పార్టీల సమాహరంగా ఆ ఫ్రంట్ ఉంటుందని కూడా చెబుతున్నారు. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, నిధులు ఉండేలా ఫ్రంట్ పాటుపడుతుందని కూడా కేసీయార్ చెప్పుకొస్తున్నారు. 

నిజానికి కేసీయార్ ఫ్రంట్ ఆలోచనలు బాగానే ఉన్నాయాని మేధావులు సైతం అంటున్నారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలు కూడా ఆలోచింపచేసేవేనని అంటున్నారు. కేంద్రం వద్ద ఉమ్మడి అధికారాలు పెట్టుకుని రాష్ట్రాలను బలహీన పరచే రాజకీయాలు చేస్తోందని కూడా చెబుతున్నారు. అయితే ఇది ఎంత వరకూ వర్కఔట్ అవుతునందన్నదే ప్రశ్నగా ఉంది.


కాంగ్రెస్ తోనే బాబు:


దేశంలో కాంగ్రెస్ లేదా బీజేపీ ఈ రెండు పెద్ద ఫోర్సులు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, వచ్చినా మనుగడ సాగించలేదన్నది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ కారణంగానే ఆయన బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ తో కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బాబు ప్రతిపాదనలను కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కూడా మమతా బెనర్జీ, మాయావతి వంటి పెద్ద పార్టీలు తామే కూటమికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాయి. ఇదిలా ఉండగానే ఇపుడు కేసీయార్ ఫ్రంట్ తెరపైకి వస్తోంది.


అది కుదరదన్న బాబు:


కేసీయార్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్ ఓ విఫల ప్రయోగం అని చంద్రబాబు అంటున్నారు. పార్టీ నాయకులతో జరిగిన టెలి కాంఫరెన్స్ లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు లేక ముగ్గురు నాయకులతో ఫ్రంట్ కడితే అది అధికారంలోకి వస్తుందా అని బాబు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ ఫ్రంట్ బీజేపీకి అనుకూలమని కూడా బాబు అనుమానిస్తున్నారు. ఇక కేసీయార్ ఎటువైపో చెప్పాలని కూడా మరో మారు ఆయన ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఈ ఇద్దరు చంద్రుల కూటమి రాజకీయాలు కూడా జాతీయ స్థాయిలో ఎంతవరకు ఫలితం ఇస్తాయన్నది చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీల‌ సంఖ్య ఆధారంగా వీరికి పెద్దగా ప్రాముఖ్యత దక్కదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరు కలసి ఉంటే 42 ఎంపీలు అవుతాయని, అపుడు దేశంలోని ఇతర పార్టీలు సైతం మాట వినే పరిస్థితి ఉంటుందని కూడా చెబుతున్నారు. చూస్తే ఇద్దరు చంద్రులు విడిగానే జాతీయ రాజకీయలు చేస్తున్నారు కనుక వీరి వల్ల ఇతర నేతలకు లబ్ది కల్గుతుంది తప్ప తెలుగు వారిగా ఈ ఇద్దరినీ చక్రం తిప్పే స్థాయిని ఉత్తరాది నాయకులు ఇవ్వరన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: