ఏపీలో రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మారుతున్నాయి. 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా నాయ‌కులు ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ? ఎవ‌రు ఎప్పుడు ఎటు జంప్ అవుతారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స‌భ్యుడు, సీనియ‌ర్ రాజ‌కీయ నేత అవంతి శ్రీనివాస్ రావు కూడా పార్టీ మారుతున్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆయ‌న పార్ల‌మెంటుకు పోటీ చేసేది లేద‌ని చెప్పార‌ని వార్త‌లు విజృంభించాయి. ఇది ఒక‌ర‌కంగా సంచ‌ల‌నంగా మారింది.


పార్ల‌మెంటుకు తాను వెళ్తున్నా.. ఇక్క‌డి(విశాఖ‌) ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను తాను నెర‌వేర్చ‌లేక‌పోయాన‌ని ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం, ముఖ్యంగా రైల్వే జోన్ విష‌యంలో ఆయ‌న చేసిన ఏ ఒక్క చ‌ర్యాఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న డిమాండ్‌లో అర్ధం ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. అయితే, ఆయ‌న కోరిన‌ట్టు భీమిలి టికెట్ ఇచ్చే విష‌యంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికీ ఎలాంటి స్ప‌ష్టమైన క్లారిటీ కూడా ఇవ్వ‌లేదు. దీంతో పార్టీ మారి వైసీపీలోకి చేరి పోయి.. భీమిలి టికెట్‌పై పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. నిప్పు లేందే పొగ‌రాద న్న‌ట్టుగా అవంతి మ‌న‌సులో ఈ త‌ర‌హా ఆలోచ‌న లేకుండానే ఆయ‌న గురించి ఇలాంటి వార్త‌లు వ‌స్తున్నాయా? అనేది సందేహం. 


2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి అవంతి భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు గంటాతో పాటు టీడీపీలోకి జంప్ చేసి అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచారు. ఇక ఎంపీగా త‌న‌కు సంతృప్తి లేద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెపుతూ వ‌స్తున్నారు. భీమిలి సీటు విష‌యంలో గంటాకు, అవంతికి మ‌ధ్య గ్యాప్ ఎక్కువైంది. ఒకానొక ద‌శ‌లో అవంతి జ‌న‌సేన‌లోకి వెళుతున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కోసం ఆయ‌న వైసీపీలోకి వెళుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అవంతి శ్రీనివాస్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ క్లారిటీలోనే అసలు విష‌యాన్ని ఆయ‌న మిస్ చేయ‌డం గ‌మ‌నార్హం. 


తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, కేంద్రం కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటువంటి తప్పుడు ప్రచారాల ద్వారా టీడీపీని బలహీనపరిచేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడల ద్వారా పార్లమెంటులో టీడీపీ పోరాటాన్ని ఆపలేరని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామ ని తెలిపారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీకి చెందిన పలువురిపై ఈడీ, ఐటీ శాఖలతో దాడు లు చేయించిన కేంద్రం... ఇప్పుడు రాజకీయ కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. అయితే, తాను పార్టీ మారుతున్న విష‌యాన్ని నేరుగా చెప్ప‌కుండానే ఇలా డొంక‌తిరుగుడు వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా అవంతి త‌ప్పించుకున్నారా? అనే సందేహాల‌కు అవ‌కాశం ఇస్తున్నాయి. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: