కేసీఆర్ అంటే తెలంగాణ ఐకాన్. సాధారణంగా తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఆంధ్రా పెత్తనానికి వ్యతిరేకంగా. అందుకే తెలంగాణవాదులన్నా.. నాయకులన్నా ఆంధ్రాలో ప్రజలకు అంత సదభిప్రాయం ఉండదు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీన్ చాలావరకూ మారిపోయింది.



రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలసి ఉందాం.. అన్న స్పృహ పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కేసీఆర్ ను అభినందిస్తూ ఆంధ్రా ప్రాంతంలో పలుచోట్ల హోర్డింగులు, కటౌట్లు వెలుస్తున్నాయి. గుంటూరు, మాచర్ల, గుడివాడ, కోనసీమ.. ఇలా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ విజయాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.



తెలంగాణలో చంద్రబాబు ప్రచారాన్ని ఎదురొడ్డి మరీ కేసీఆర్ విజయం సాధించడం సహజంగానే ఏపీలోని ప్రతిపక్షాలకు చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే కేసీఆర్ ను, హరీశ్ రావును అభినందిస్తూ ఫ్లెక్సీలు పెట్టేవారిలో ఎక్కువగా వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఉంటున్నారు. కోనసీమ ముఖ ద్వారంలో కేసీఆర్ ను.. ఆడుమగాడ్రా బుజ్జీ అనే క్యాప్షన్‌తో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.



గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జనహృదయనేత, ఓరుగల్లు విజేత అంటూ కేసీఆర్ ను కీర్తించారు. మరోవైపు ఆంధ్రాలోని వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కేసీఆర్ విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: