సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా కోలుకుంది. ఇదే ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రధాని పగ్గాలు చేపట్టాలని రాహుల్ టీం భావిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ వరుస విజయాలకు బ్రేక్ పడింది. మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోగా.. మిగిలిన రెండు రాష్ట్రాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓసారి పరిశీలిద్దాం..

 Image result for 5 state election results

రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్..!

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకిత్తించిన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితి పితగా భావించే కేసీఆర్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో 63 స్థానాలు సాధించిన టీఆర్ఎస్ ఈసారి గణనీయంగా లబ్దిపొందింది. ఏకంగా 88 స్థానాలు సాధించింది. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, విపక్షాల అనైక్యత.. తదితరాలు టీఆర్ఎస్ కు కలిసొచ్చిన అంశాలు. తెలంగాణను ఇప్పటికే గాడిలో పెట్టానని చెప్తున్న కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారిస్తానని ప్రకటించారు.

 Image result for kcr as cm

మధ్యప్రదేశ్ పగ్గాలు కమల్ నాథ్ కే.!

మధ్యప్రదేశ్ లో విజయం బీజేపీ – కాంగ్రెస్ మధ్య ఊగిసలాడింది. కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించి తక్కువ సీట్లు పొందింది. తక్కువ ఓట్లు వచ్చినా కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీకి అధికారం దక్కింది. మొత్తం 230 నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 114, బీజేపీకి 109 లభించాయి. బీఎస్పీ, ఎస్పీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడంతో అధికారం కాంగ్రెస్ వశమైంది. ఇక్కడ సీనియర్ నేత కమల్ నాథ్, జూనియర్ యంగ్ లీడర్ జ్యోతిరాదిత్య సింధియా మధ్య ముఖ్యమంత్రి పీఠంపై దోబూచులాట జరిగింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా కమల్ నాథ్ పేరు ప్రతిపాదించడంతో ఆయనకు మార్గం సుగమమైంది. 15 ఏళ్లపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తాజా మాజీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటికెళ్లి కమల్ నాథ్ పరామర్శించారు. కమల్ నాథ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందనలు తెలిపారు.

 Image result for kamal nath

రాజస్థాన్ పగ్గాలు ఎవరికో..?

ఇక రాజస్థాన్ లో మొత్తం 200 స్థానాలుండగా ఒక చోట ఎన్నిక జరగలేదు.. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 100 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ మార్క్ సాధించింది. దీంతో అధికారం కాంగ్రెస్ వశమైంది. ఇక్కడ కూడా సచిన్ పైలట్, అశోక్ గెహ్లోత్ మద్య ముఖ్యమంత్రి పీఠం దోబూచులాడుతోంది. ఇద్దరికీ బలమైన కేడర్ ఉంది. ఇద్దరు లీడర్లూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగానే కృషి చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిగా మారింది. సచిన్ పైలట్ కు రాహుల్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. గెహ్లోత్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్టు సమాచారం.

 Image result for bhupesh baghel cartoon

పోరాటయోధుడికే ఛత్తీస్ గఢ్ పీఠం..?

ఛత్తీస్ గఢ్ లో చావల్ బాబాగా పేరొందిన రమణ్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ ఇంటికి పంపించింది. 90 స్థానాలున్న అసెంబ్లీలో మూడింటి రెండొంతుల మెజారిటీ సాధించి ఆశ్చర్యపరిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 68 స్థానాలు రాగా బీజేపీకి 15 మాత్రమే దక్కాయి. పీసీసీ చీఫ్ గా ఉన్న భూపేష్ బాఘెల్ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. బీజేపీని ఎదుర్కోవడంలో బాఘెల్ ముందున్నారు. అయితే భూకబ్జా కేసులు, సెక్స్ సీడీల కేసులు బాఘెల్ ను వెంటాడుతున్నాయి. ఎన్నికల ముందే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇవేవీ కాంగ్రెస్ శ్రేణులను కలవరపరచట్లేదు. బాఘెల్ వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు.

 Image result for zoramthanga

మిజోరం సారథి జోరాంథాంగా..!

మిజోరం నేషనల్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గెరిల్లా యోధుడు జోరాంథాంగా.. ఆ రాష్ట్ర సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపడుతున్నారు. గెరిల్లా యోధుడిగా పేరొందిన జోరాంథంగా చాలా కాలంపాటు అజ్ఞాతంలోనే గడిపారు. అయితే మిజోరంవాసుల మన్ననలు పొందిన జోరాంథంగాకు ముఖ్యమంత్రి పీఠం నల్లేరుపై నడకే అయింది. 15వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న జోరాంథంగా.. మద్యనిషేధం ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: