ఈ ఏడాది ఇప్పటికే రెండు భయంకరమైన తుపాన్లను కోస్తా తీరం చవి చూసింది. గజ తుపాను, తితిలీ తుపాను కోస్తా జిల్లాలకు తీరని నష్టాన్ని,కష్టాన్ని మిగిల్చాయి. అది చాలదన్నట్లుగా ఇపుడు పెథాయ్ తుపాను కోస్తాను వణికిస్తోంది.ఇది ఆ రెండిటి కంటే పెద్దది అని వాతావరణ శాఖ అధికారు హెచ్చరించడంతో తొమ్మిది జిల్లాల ప్రజానీకం  ఇపుడు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. పెథాయ్ ఆదివారం సాయంత్రం నుంచే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.


విశాఖలో భారీ వర్షం:


ఇదిలా ఉండగా విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాల చోట్ల ఈదురుగాలుకు బలంగా వీస్తున్నాయి. ఇక రూరల్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడి వారు అక్కడే ఉండిపోతున్నారు. రవాణా సదుపాయాలు సైతం బ్రేక్ అయ్యాయి. రోడ్ల మీదకు వాన నీరు వచ్చి చేరడంతో కదిలేందుకు దారి లేకుండా పోయింది. పెథాయ్ తుపాను బీభత్సాన్ని ద్రుష్టిలో ఉంచుకుని విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ రోజు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు శెలవు ప్రకటించారు. 


కోస్తాకే పెను ముప్పు :


పెథాయ్ తుఫానుతో కోస్తా తీరంలోని జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట, హంసలదీవి, బాపట్ల, బోగాపురం, ఉప్పాడలో 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. ఈదురుగాలుల ధాటికి దివిసీమలో 10 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. అటు నిజాంపట్నం ఓడరేవులో అధికారులు 5వ నెంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


తీరం దాటేటపుడు అలజడే :


మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నం తర్వాత తుని-యానాం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకువస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కీలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: