ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంది. అయితే, ఇప్పుడు తెలంగాణా ఎన్నిక‌లు ముగిసిన‌ నేప‌థ్యంలో ఏపీలోనూ రాజ‌కీయ కాక ప్రారంభమైంది. అధికారంలోకి వ‌చ్చేయాల‌ని భావిస్తున్న విప‌క్షం వైసీపీ తెలంగాణాలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ను, ఓటింగ్ స‌ర‌ళిని కూడా చాలా జాగ్ర‌త్త‌గా అంచ‌నా వేస్తోంది. అక్క‌డ ఏయే కూట‌ములు ఎలా ప‌నిచేస్తున్నాయి? ఏయే వ‌ర్గాలు ఎటు మొగ్గుతున్నాయి? ప‌్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ఎలా చీల్చుతున్నారు. ఎవ‌రెవ‌రు తెర‌చాటు ఒప్పందాలు చేసుకుని సీఎం పీఠం దిశ‌గా అడుగులు వేస్తున్నారు? అనే విష‌యాల‌ను చాలా నిశితంగా గ‌మ‌నిస్తోంది. వాటి అంచ‌నా ఆధారంగానే ఏపీలోనూ వ‌చ్చే నాలుగు మాసాల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌పై వైసీపీ అధినేత ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏపీలో ప్ర‌తి ఓటు, ప్ర‌తి సీటు అత్యంత ప్ర‌ధానంగా భావిస్తున్నారు జ‌గ‌న్‌. 


ఆదిశ‌గానే ఇప్ప‌టికి అనేక మార్పులు, చేర్పులు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన‌మైన ప‌లు జిల్లాల్లో ఇంచార్జుల‌ను రాత్రికి రాత్రి మార్చేసి.. గెలుపు గుర్రాలుగా జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న వారికి అవ‌కాశం ఇచ్చారు. దీంతో ప‌లు చోట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ఎవ‌రూ రెబ‌ల్ కాకుండా బుజ్జ‌గించే య‌త్నం చేశారు. ఇది చాలా మేర‌కు వ‌ర్క‌వుట్ అయింది. నెల్లూరులోని వెంక‌ట‌గిరి లాంటి ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ప్పా. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు అవ‌స‌ర‌మైన అన్ని వ్యూహాలు అమ‌లు చేసేందుకు సిద్ధ‌మై దూసుకుపోతున్నారు కూడా. అయితే, ఇక్క‌డే మ‌రో ప్ర‌ధాన స‌మ‌స్య వైసీపీని వెంటాడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో త్రిముఖ పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఎటు పోతుంది? అన్న‌ది పాయింట్‌!! 


నిజానికి ఈ విష‌యం అంత తేలిక‌గా తీసుకునేదికాదు. తెలంగాణా ఎన్నిక‌ల‌ను చూసుకున్నా.. పార్టీలకు సంప్ర‌దాయ ఓటు బ్యాంకు ఎప్పుడు పెద్ద‌గా బెస‌క‌దు! కానీ, త‌ట‌స్థ ఓటు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక వ‌ర్గాల ఓటు మాత్ర‌మే ప్ర‌ధానంగా గెలుపును నిర్దేశిస్తుంది. తెలంగాణా ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఈ విష‌యంలో మ‌హాకూట‌మి వ్యూహం సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు వేటిక‌వే పోటీ ప‌డి ఉంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ప‌ఠాపంచ‌ల‌య్యేది. ఈ క్ర‌మంలోనే అవి వ్యూహాత్మ‌కంగా ఒక్క‌ట‌య్యాయి. అయితే, సీపీఎం మిగిలిన ప‌క్షాలు కూడా ఇదే త‌ర‌హా వ్యూహంతో ముందుకు సాగాయి. దీంతో అక్క‌డ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఆయా పార్టీల‌కు ప‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే ఇక్క‌డ ఎన్ని కూట‌ములు క‌ట్టినా, సీపీఎం బీఎల్ఎఫ్ ఏర్పాటు చేసినా, బీజేపీ ఒంట‌రిగా పోరాడినా ఏం చేయ‌లేక‌పోయాయి.


స‌రే! ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును వైసీపీ అందిపుచ్చుకోవాలి. లేకుంటే.. కేవ‌లం సంప్ర‌దాయ ఓటు బ్యాంకునే న‌మ్ముకుంటే గెలవ‌డం జ‌రిగే ప‌నికాదు. నిజానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ రంగంలో లేక‌పోయి ఉంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఖ‌చ్చితంగా వైసీపీకే వెళ్లేది. కానీ, ప‌వ‌న్ కూడా ఒంట‌రిగానే పోరుకు రెడీ అయ్యారు(ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చెప్పిన దానిని బ‌ట్టి) కాబ‌ట్టి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌లో కొంత వ‌ర‌కు జ‌న‌సేన‌కు ప‌డే ఛాన్స్ ఉంది. అంతిమంగా దీని ప్ర‌భావం జ‌గ‌న్‌కే మైన‌స్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా, కాంగ్రెస్‌-టీడీపీలు పొత్తు పెట్టుకుంటే... ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి ఉన్నాయ‌నే ధీమాతో ఉన్న వారు కూడా అటు వైపు మొగ్గితే.. జ‌గ‌న్‌కే న‌ష్ట‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. 
ReplyForward


మరింత సమాచారం తెలుసుకోండి: