రాజ‌కీయాల్లో నేత‌ల మ‌ధ్య ఆధిపత్య పోరు పార్టీల‌కు చేటు తెస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీకే ప‌రిమితమై న ఈ వ‌ర్గ రాజ‌కీయాలు ఇప్పుడు వైసీపీలోనూ పాకాయి. టీడీపీలో నేతల మ‌ధ్య ఆధిప‌త్య హోరు ఉందంటే.. అర్ధం ఉంది. అదికార పార్టీ కాబ‌ట్టి.. అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు చేస్తున్నార‌నే భావన ఉండేది కానీ, విప‌క్షంలో ఉండి.. పార్టీని అభివృద్ధి ప‌థంలో న‌డిపించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన వైసీపీ నేత‌లే ఇప్పుడు రోడ్డున ప‌డికొట్టుకుంటున్నారు. ప్ర‌ధానంగా వైసీపీకి అత్యంత బ‌లం ఉన్న క‌ర్నూలులోనే ఇలా జ‌రుగుతుండ‌డంతో పార్టీ సానుభూతి ప‌రులు కూడా నివ్వెర పోతున్నారు. ఇప్ప‌టికే ఇక్క‌డ వైసీపీ బ‌లాన్ని టీడీపీ గుంజుకుంది. 


చాలా మంది నాయ‌కులు ఇద్ద‌రు ఎంపీలు కూడా టీడీపీకి మ‌ద్ద‌తిస్తున్నారు. మ‌రి అలాంటి చోట తిరిగి పార్టీని బ‌లోపేతం చేయాల్సిన నాయ‌కులు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటూ.. వైసీపీని బ‌జారున ప‌డేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి భ‌ర్త గౌరు వెంక‌ట రెడ్డి ఇటీవ‌ల కాలంలో త‌న భార్య ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాణ్యంతో పాటు వైసీపీ నాయ‌కుడు ఐజ‌య్య ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నందికొట్కూరుపై కూడా క‌న్నేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాణ్యం ద‌క్క‌క‌పోతే.. క‌నీసం నందికొట్కూరు నుంచైనా త‌న స‌తీమ‌ణిని  పోటీకి దింపాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నందికొట్కూరులో పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. 


అయితే, నందికొట్కూరులో ఐజ‌య్య‌ను త‌ప్పించి.. తాను సీటు కైవ‌సం చేసుకునేందుకు బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పైకి ఐజ‌య్య‌తో క‌లిసి ప‌నిచేస్తూనే లోపాయికారీగా ఐజ‌య్య‌పై పైచేయి సాధించి ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ టికెట్‌పై క‌న్నేసిన గౌరుకు ఇక్క‌డ నుంచి ఎట్టి ప‌రిస్తితిలో పోట చేయాల‌ని భావిస్తున్న బైరెడ్డికి మ‌ధ్య నందికొట్కూరు రాజ‌కీయం చిచ్చుపెట్టింది. వాస్త‌వానికి ఆది నుంచి కూడా ఇద్ద‌రూ చెరోపార్టీలో ఉంటూ కారాలు మిరియాలు నూరుకునేవారు. ఇప్పుడు ఒకే పార్టీలోకి వ‌చ్చినా.. ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు చేసుకుంటున్నారు. దీంతో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. 


 గౌరు వెంకటరెడ్డిపై సిద్ధార్థరెడ్డి అడుగడుగునా నిప్పులు చెరుగుతున్నారు. తన బావ, నందికొట్కూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ అయిన మాండ్ర శివానందరెడ్డిని గౌరు వెంకటరెడ్డి ఆ పార్టీలోకి పంపించి, తెరవెనుక చక్రం తిప్పారని సిద్ధార్థరెడ్డి విమర్శించారు. వైసీపీ నుంచి పోటీచేసిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలను తెలుగుదేశంపార్టీలోకి పంపి బావ- బావమరుదులు వైసీపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. త్వరలోనే వీరిద్దరి బండారం బయటపెడతాని సిద్ధార్థరెడ్డి అనడం సంచ‌ల‌నంగా మారింది. నందికొట్కూరు ప్రజలకు గౌరు వెంకటరెడ్డి క్షమాపణ చెప్పేంతవరకూ ఆయనతో కలసి పనిచేసే ప్రసక్తే లేదని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  తేల్చిచెప్పారు. మ‌రి ఇలాంటి ప‌రిణామాలు ఎన్నిక‌ల  స‌మ‌యంలోపార్టీకి తీవ్ర‌మైన ప్ర‌మాదంగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: