గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి కోపంగా ఉందనిపిస్తుంది.  వరుసగా వివిధ రకాల తుఫాన్లతో ప్రజలను భయకంపితులను చేస్తుంది.  ఈ తుఫాన్ల వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం బాగా వాటిల్లుతుంది. తాాజాగా ఆంధ్రప్రదేశ్ ను పెథాయ్ తుపాను గజ గజ వణికిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఖాట్రేనికోన వద్ద తీరాన్ని తుపాను తాకింది. దీంతో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 


తూర్పు గోదావరి జిల్లా ఇంజారంలో 11.75 సెంటీమీటర్లు, ఉప్పలగుప్తంలో 11.7, ఆర్యవటంలో 8.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం విజయవాడలో 13 సెంటీమీటర్లు, గుడివాడలో 10, కైకలూరు, తెనాలి, చింతపూడి, రేపల్లెల్లో ఏడు సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో ముందు జాగ్రత్తగా 101 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

యానాం మెయిన్ రోడ్డు

రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 15 కిలోమీటర్ల వేగంతో పెథాయ్‌ తుపాను కదులుతోంది. సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. 


పెథాయ్ తుపాను ప్రభావానికి విశాఖ జిల్లాలోని ఎస్ రాయవరం మండలం సోముదేవపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. రేవు పోలవరం గ్రామానికి చెందిన ఒక బోటు గల్లంతు అయింది. కాకినాడ నుంచి విశాఖ వైపు వస్తుండగా తీవ్ర తుపానులో బోటు చిక్కుకుంది. ఈ బోటులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు.. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  రాజమండ్రి, విశాఖ ఎయిర్‌పోర్టుల్లో వాతావరణం అనుకూలించలేదు. ఈదురుగాలులు, మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. సీఎం ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 4.30కి చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు. మంగళవారం సీఎం కాకినాడ, విశాఖ వెళ్లే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: