తెలంగాణాలో ఇప్ప‌టికే చావు త‌ప్పిన చందంగా త‌యారైన కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారిపోతుందా?  వ‌చ్చే రోజుల్లో ఈ పార్టీకి మ‌రింత గ‌ట్టి దెబ్బ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌తంలో ఉన్న స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ పోగొట్టుకుంది. దీంతో వీరి సంఖ్య 19కి ప‌డిపోయింది. వీరిలోనూ ఎవ‌రు ఎప్పుడు జంప్ చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అస‌లు పార్టీ పుంజుకుంటుందా? వ‌చ్చే ఐదేళ్ల కాలం అధికార పార్టీని ఇబ్బంది పెడుతుందా? ప‌్ర‌శ్నిస్తుందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే, మ‌రోప‌క్క‌, ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు ఉన్న మండ‌లి స‌భ్యుల్లోనూ భారీ కోత ప‌డుతుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. 


విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణా శాస‌న మండ‌లిలో.. కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి , టీ సంతోష్ కుమార్ , ఆకుల లలిత , రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరో ఎమ్మెల్సీ ఉండేవారు కానీ..ఆయన ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో ముగ్గురి పదవి కాలం..మార్చితో ముగుస్తుంది. షబ్బీర్ అలీ, సంతోష్, పొంగులేటిలు మార్చి తర్వాత మాజీలవుతారు. మరో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.. రాజీనామా చేయక తప్పని పరిస్థితి. అంటే.. ఆకుల లలిత ఒక్కరే కాంగ్రెస్ పార్టీకి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తారు. 


అదేస‌మ‌యంలో.,. టీఆర్ ఎస్ లో ఎమ్మెల్సీలుగా ఉండి.. ఆపార్టీతో విభేదించి.. కాంగ్రెస్‌లో చేరిన వారు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ లు భూపతి రెడ్డి , యాదవ్ రెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలు ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. అయితే, వీరిని టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ క్ర‌మంలో వీరిని ఎప్పుడైనా ఆ పార్టీ స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉంది. దీంతో వీరంతా కూడా మాజీలుగా మారిపోవ‌డం ఖాయం. పోనీ.. కొత్త‌గా కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్కుతాయా? అనేది చూస్తే.. ప్ర‌స్తుతం అసెంబ్లీలో సాధించిన సీట్ల ఆధారంగానే (బ‌లం) ఎమ్మెల్సీ సీట్లు వ‌స్తాయి.

ఇప్పుడు కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు జంప్ చేయ‌కుండా ఉంటే.. ఒక స్థానం వ‌స్తుంది. ఒక‌వేళ టీఆర్ ఎస్ పార్టీజంపింగుల‌ను ప్రోత్స‌హిస్తే.. ఇది కూడా ద‌క్కే ప‌రిస్థితి లేదు. మొత్తంగా కాంగ్రెస్కు ఆకుల లలిత మాత్ర‌మే మిగులుతారు. ఈ ప‌రిస్థితి ఇప్పుడు కాంగ్రెస్‌ను తీవ్రంగా భ‌య‌పెడుతోంది. మ‌రి నాయ‌కులు ఏం చేస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: