రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు అంచ‌నాలు లెక్క త‌ప్ప‌డం అంటూ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఆయ‌న ఏ విష‌యంపై అంచ‌నా వేసినా..అది నిజం అవుతూ వ‌చ్చింది. ఎమ్మెల్యేల విష‌యంలోకానీ, మంత్రుల విష‌యంలోకానీ, పార్టీ కార్య‌క‌ర్త‌లు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ఇలా ఎవ‌రిని తీసుకుని లెక్క‌లు వేసుకున్నా.. చంద్ర‌బాబు అంచ‌నాలు ప‌క్కాగా స‌రిపోయాయి. ఇక‌, పార్టీ విష‌యంలోనూ తాజాగా చంద్ర‌బాబు వేసుకున్న అంచ‌నాలు చ‌క్క‌గా కుదిరాయి. గ‌త కొన్నాళ్లుగా చంద్ర‌బాబు రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 15 చోట్ల చాలా వీక్‌గా ఉన్నామ‌ని, దాదాపు 100 స్థానాల్లో టీడీపీ సైకిల్ ప‌రుగులు పెడుతోంద‌ని చెప్పుకొస్తున్నారు. ప్ర‌ధానంగా పార్టీ నేత‌లు, స‌భ్య‌త్వ న‌మోదు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న చంద్ర‌బాబు ఎక్క‌డ త‌న‌కు అనుమానం వ‌చ్చినా.. అక్క‌డ స‌ర్వే చేయిస్తూ.. లెక్క‌లు స‌రిచూసుకుంటున్నారు. 


తాజాగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల తొలి వారంలోనే పార్టీ స్థితి గ‌తుల‌పై చంద్ర‌బాబు లెక్క‌లు తెప్పించుకున్నారు. గ‌డిచిన మూడు మాసాల్లో ప‌రిస్థితిని బేరీజు వేసుకున్నారు. గ‌తంలో తాను ఎక్క‌డెక్క‌డ నాయ‌కులకు హెచ్చ‌రిక‌లు జారీచేశారో ? ఎక్క‌డైతే పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న ఆదేశించారో ఆయా స్థానాల్లో ఇప్ప‌టికీ పార్టీ మెరుగు ప‌డ‌లేద‌ని తాజాగా చంద్ర‌బాబు చేతికి అందిన స‌ర్వే ఫ‌లితం స్ప‌ష్టం చేసింది. దీనిని ప‌రిశీలించిన చంద్ర‌బాబు దీనిపై త‌మ్ముళ్ల‌కు తాజాగా క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెల‌ల కిందట భారీ ఎత్తున టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మా నికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ నేత‌ల‌ను గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుతో ఓట్ల‌కు లింకు ఉండ‌డంతో నాయ‌కులను అలెర్ట్ చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా నేత‌లు బాగానే ప‌నిచేసినా.. కేవ‌లం 15 స్థానాల్లో మాత్రం అంచ‌నాలు త‌ప్పాయి. 


ముఖ్యంగా చంద్ర‌బాబు ఏయే స్థానాల్లో హెచ్చ‌రించారో.. అక్క‌డ నాయ‌కులు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించార‌నే రిపోర్ట్ వ‌చ్చింది. వీటిలో నెల్లూరు న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం, గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం మ‌రింత దారుణంగా ఉన్నాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా వైసీపీ నేత‌ల అధీనంలో ఉన్నాయి. దీంతో చంద్ర‌బాబు ఇక్క‌డ గ‌ట్టిగా కృషి స‌భ్య‌త్వాల‌ను పెంచ‌డంతోపాటు పార్టీ ని ప‌రుగులు పెట్టించాల‌ని సూచించారు. దీనికి సంబంధించి ఎలా న‌డుచుకోవాలో కూడా బాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్ద‌రికి కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించా రు. అయితే, వారిద్ద‌రూ కూడా ఈ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో స‌భ్య‌త్వ న‌మోదులో వెనుక‌బ‌డిన 15 స్థానాల్లో ఈ రెండు ముందు వ‌రుసలో ఉన్నాయ‌ని, తాను చెబుతున్నా.. ఎవ‌రూ త‌న మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవ‌డం లేద‌ని బాబు తీవ్ర ఆగ్ర‌హ‌మే వ్య‌క్తం చేశారు.


 తాజాగా నిర్వ‌హించిన టెలీ కాన్ఫ‌రెన్స్‌లో బాబు నెల్లూరుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూప‌డం గ‌మ‌నార్హం. ``నేను వేసుకున్న అంచ‌నాలు అలాగే ఉన్నాయి. వాటిని మార్చాల‌నిమీకు ఎన్నిసార్లు చెప్పినా.. ప్ర‌యోజ‌నం లేదు. న‌న్నే రంగంలోకి దిగ‌మంటారా?`` అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ఆ ఇద్ద‌రు మంత్రులు రేపో మాపో స్వ‌యంగా రంగంలోకి దిగుతార‌ట‌. ఏదేమైనా చంద్ర‌బాబు ప‌క్కా లెక్క‌ల‌తోనే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నార‌ని చెప్ప‌డానికి ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చాల‌ని అంటున్నారు టీడీపీ అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: