‘ఏరు దాటేంత వరకూ ఓడ మల్లన్న..ఏరు దాటగానే బోడి మల్లన్న’ ఈ సామెత తెలుగు మీడియాకు బాగా వర్తిస్తుంది. కాకపోతే పై సామెత తెలంగాణాలోని తెలుగు మీడియా విషయంలో తిరగబడింది. ఏరు దాటిన తర్వాత కూడా ఓడ మల్లన్న అని అనాల్సి రావటమే విచిత్రం. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణాలోని తెలుగు మీడియాలో ప్రధానంగా రెండు దినపత్రికలు, ఓ టివి చానల్ కెసియార్ కు వ్యతిరేకంగా గళం విప్పాయి. అయితే, వెంటనే ఓ విషయంలో కెసియార్ దగ్గర టివి చానల్ తో పాటు దమ్మున్న దినపత్రికి ఇరుక్కున్నాయి. దాంతో దొరికిందే సందని రెండింటిపైన అప్రకటితంగా దాదాపు ఏడాదిపాటు నిషేధం దెబ్బ పడింది. నిషేధం దెబ్బ నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో పాహిమాం అంటూ కెసియార్ కాళ్ళముందు సాగిలపడ్డాయి. ఆ దెబ్బకు మొత్తం మీడియా అంతా కెసియార్ ముందు సాగిలపడ్డాయి. అప్పటి నుండి ఒక్కటంటే ఒక్క వార్త కూడా కెసియార్ కు వ్యతిరేకంగా అచ్చేసిన పాపాన పోలేదు.

 

సీన్ కట్ చేస్తే కెసియార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ముందస్తు ఎన్నికల్లో కెసియార్ కు 80 సీట్లు తగ్గవని దమ్మున్న మీడియా జోస్యం కూడా చెప్పింది. అయితే, తెర వెనుక జరిగిన మార్పులతో కాంగ్రెస్, టిడిపి ప్రధాన పార్టీలుగా మహాకూటమి ఏర్పడింది. దాంతో మళ్ళీ రెండు దినపత్రికల్లో పచ్చరంగు పులుముకోవటం మొదలైంది. ఒకవైపు కెసియార్ అంటే వణుకు. మరోవైపు తమ ‘కుల’దైవంకు జాకీలేసి ఎలాగైనా మహాకూటమిని తెలంగాణాలో అధికారంలోకి తేవాలన్న బలమైన కోరిక. మొత్తానికి కులదైవం వైపే త్రాసు మొగ్గింది. దాంతో మెల్లిగా రెండు దినపత్రికల్లో వార్తలన్నీ పసుపురంగు పులుముకోవటం ఊపందుకుంది.


ఇక్కడ ఆ రెండు దినపత్రికల దృష్టిలో మహాకూటమి అంటే కులదైవమనే లెక్క. అందుకనే టిఆర్ఎస్ వార్తలను కూడా పక్కనపడేసి మరీ మహాకూటమికి ప్రచారం ఇవ్వటం మొదలైంది. కెసియార్ వార్తలకన్నా మహాకూటమి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటమంటే ఏమనర్ధం ? తొందరలో తీరంకు చేరుకుంటాము కాబట్టి ఓడ మల్లన్నతో పనిలేదనే కదా ? అలా అనుకునే చేతిలో ఉన్న మాయోపాయాలన్నింటినీ రంగరించి మరీ వార్తలు అచ్చేశాయి. దాదాపు 15 రోజుల పాటు మహాకూటమే అధికారంలోకి రాబోతోందన్న భ్రమలు కల్పించారు జనాలకు. అందుకు ఎన్నికల్లో సర్వేల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులరైన లగడపాటి రాజగోపాల్ ను కూడా వాడుకున్నాయి. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమికి 80 సీట్లంటూ లగడపాటితో తప్పుడు నివేదికలు ఇప్పించాయి.

 

 అమాయక జనాలు లగడపాటి సర్వే రిపోర్టు నిజమని నమ్మేసి వేల కోట్ల రూపాయలు పందేలు కాసి నెత్తిన గుడ్డేసుకున్నారు. సరే, ప్రచారం, పోలింగ్ ఎలాగున్నా తర్వాత నాలుగు రోజుల పాటు కెసియార్ అండ్ కో కు కూడా కంటిమీద నిద్రలేకుండా చేశాయి ఆ పచ్చ పత్రికలు. కౌంటింగ్ మొదలైన గంటసేపటికే ఏమని తేలిపోయింది ? టిఆర్ఎస్ దెబ్బకు మహాకూటమి ప్రత్యేకించి కులదైవంకు దిమ్మ తిరిగిందని. కులదైవం ప్రచారం చేసిన 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల మహాకూటమి అభ్యర్ధులు ఓడిపోయారంటేనే అర్ధమవుతోంది కులదైవం ప్రభావం ఎంతుందో ?

 

కులదైవమంటే తిరిగి చూడకుండా తెలంగాణా నుండి అమరావతికి వెళ్ళిపోయారు సరే. మరి పచ్చ పత్రికల సంగతేంటి ? ఏమాత్రం సిగ్గు, మొహమాటం వంటివి లేకుండా వెంటనే బోర్డు తిప్పేశాయి. కెసియార్ అంతటోడు ఇంతటోడు అంటూ మళ్ళీ బాకాలూదటం మొదలుపెట్టాయి. తెలంగాణాకు సంబందించి కులదైవం ఊసు కూడా ఎక్కడా తేకుండా జాగ్రత్త పడుతున్నాయి. తామెక్కిన ఓడ తీరం దాటుతుంది కాబట్టి మల్లన్నతో అవసరం ఉండదనుకున్నాయి. కానీ వారి జాతకాలు తిరగబడి తీరం దగ్గరకు వచ్చిన ఓడ మళ్ళీ ఏటిలోకి వెళ్ళిపోవటంతో బోడి మల్లన్నే మళ్ళీ ఓడ మల్లన్న అవుతారని అనుకోలేదు. దాంతో ఏమాత్రం సిగ్గుపడకుండా అసలు తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు మిధ్య మహాకూటమి మిధ్య అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ అంతా గమనిస్తు ఎక్కడికక్కడ లెక్కలేసుకుంటున్న కెసియార్ అండ్ కో తెలివైన వారా లేకపోతే ప్లేటు మార్చేసిన పచ్చ మీడియాది తెలివా ?


మరింత సమాచారం తెలుసుకోండి: