వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలను ప్రలోభాలతో లాక్కెళ్ళిన తెలుగుదేశంపార్టీ తాజాగా గట్టి నేతలను కూడా లాక్కెళ్ళే యోచనలో ఉన్నట్లు సమాచారం. మామూలుగా అయితే, అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయటానికి అభ్యర్ధుల కొరత ఉండకూడదు. కానీ అలా ఉందంటే ఏమటర్ధం ? ఇదంతా ఎందుకంటే, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో వైసిపి నేత సవరపు జయమణిపై తెలుగుదేశంపార్టీ కన్ను పడిందట. ఎస్సీ నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి తరపున బొబ్బిలి చిరంజీవులు ఎంఎల్ఏగా ఉన్నారు. అయితే ఈయన వ్యవహార శైలిపై పార్టీలోనే కాకుండా జనాల్లో కూడా బాగా వ్యతిరేకత ఉందని సమాచారం.

 

2019 ఎన్నికల్లో చంద్రబాబు మార్చాలని అనుకుంటున్న సిట్టింగ్ ఎంఎల్ఏల జాబితాలో చిరంజీవులు పేరు కూడా ఉందట. అందుకే గట్టి అభ్యర్ధి కోసం వెతుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే జిల్లా ఫిరాయింపు మంత్రి సుజయ కృష్ణ రంగారావు కన్ను జయమణిపై పడిందట. రంగారావు కూడా ఒకపుడు వైసిపిలోనే ఉండేవారు కాబట్టి జయమణి గురించి పూర్తిగా తెలుసు. జయమణి 2009లో ఎంఎల్ఏగా గెలిచారు. సౌమ్యురాలిగా పేరుండటంతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా మంచి పట్టుంది. పోయిన ఎన్నికల్లోనే వైసిపి తరపున పోటీ చేసుంటే గెలిచేవారని స్ధానిక నేతలంటారు. కానీ ఎంచేతనో పోటీ చేసే అవకాశం రాలేదు.

 

పోయిన ఎన్నికల్లో టిక్కెట్టు రాకపోయినా సరే వైసిపి రాష్ట్ర కార్యదర్శిగా బాగా యాక్టివ్ గా ఉన్న జయమణి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఆశిస్తున్నారు. జగన్ నుండి కూడా టిక్కెట్టు విషయంలో భరోసా వచ్చిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే మాజీ ఎంఎల్ఏ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే టిడిపి కన్ను జయమణిపై పడిందట. ఎలగైనా మాజీ ఎంఎల్ఏను వైసిపిలో నుండి టిడిపిలోకి లాక్కోవాలని ఫిరాయింపు మంత్రి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. జయమణి విషయం చంద్రబాబు చెవిలో కూడా  వేశారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: