ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో కీలకమైన నేత. గత పదేళ్ళుగా జనంలోనే ఉంటూ వారి గుండె చప్పుడుగా మారిన నాయకుడు. వైఎస్సార్ బతికి ఉన్నపుడు జగన్ అంటే కేవలం ఆయన కుమారుడు, వ్యాపారవేత్త. తండ్రి చనిపోయేనాటికి జగన్ కేవలం మూడు నెలలు మాత్రమే అనుభవం కలిగిన ఎంపీ. ఇక ఆ తరువాత‌ ఓదార్పు యాత్రతో ఆయన ప్రస్థానం మొదలైంది.


కొండనే ఢీ కొట్టి:


జగన్ ఏకంగా కొండనే ఢీ కొట్టిన ధైర్యశాలిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా దేశంలో తిరుగుబాటు బావుటా ఎగరేయడమే కాదు. కాంగ్రెస్ కి రాజీనామా చేసి సొంతంగా పోటీ చేసి రికార్డ్ మెజారిటీతో గెలిచిన ధీరోదాత్తునిగా జనం గుండేల్లో గూడు కట్టుకున్నారు. జగన్ ప్రభంజనం  అలా మొదలై ఇప్పటికీ అదే తీరులో కొనసాగుతోంది.


త్రుటిలో గెలుపు  మలుపు:


జగన్ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తారని అంతా భావించారు. అనేక సర్వేలు సైతం ఇదే విషయాన్ని ధువీకరించాయి. అయితే అనూహ్యంగా జరిగిన పొత్తుల ఎత్తుల రాజకీయం జగన్ని అధికార పీఠానికి కొద్ది దూరంలోనే నిలిచిపోవాల్సివచ్చింది. అయినా బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తూ అనేక సమస్యలపై సర్కార్ని నిలదీస్తూ జగన్ సమర్ధంగా ప్రతిపక్ష పాత్రను నిర్వహించారు. అసెంబ్లీ లోపలా, బయటా ఉద్యమాలు చేస్తూ అధికార టీడీపీకి వణుకు పుట్టించారు.


అదే ఒరవడి:


ఇక తన తండ్రి వైఎస్సార్ బాటలో అడుగులు వేస్తూ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. 2017 నవంబర్  6న ఆయన‌ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు పదమూడు జిల్లాలను దాటుకుని ఇపుడు చివరి జిల్లాగా శ్రికాకుళం చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో జగన్ ఆరంభించిన అతి పెద్ద పోరాటం ఇచ్చాపురం వేదికగా ముగియబోతోంది. ఈ పాదయాత్రలో భాగంగా జగన్ కోట్లాది మంది ప్రజలను నేరుగా కలసి వారిని ఓదార్చుతూ ముందుకు కదలడం వర్తమాన రాజకీయాల్లో మేలి మలుపు లాంటి ఘట్టం.


సీఎంగా నట:


ఇక జగన్ వచ్చే ఏడాది పుట్టిన రోజును ముఖ్యమంత్రిగా జరుపుకుంటారని పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. శ్రికాకుళం టెక్కలిలో ఈ రోజు జగన్ పాదయాత్రలో భాగంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. పార్టీ నాయకులు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు ధ‌ర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. జనం పెద్ద ఎత్తున హాజరై జగన్ని కలసి అభినందించారు. ఇక జగన్ ఈ ఏడాదికి ప్రతిపక్ష నాయకుడు, వచ్చే ఏడాది ముఖ్యమంత్రిగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని పార్టీ నాయకులంతా కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: