ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో తలబొప్పికట్టిన ఏపీ సీఎం చంద్రబాబు ఇక దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దన్న ఆలోచనలో ఉన్నారు. ఈ ఆరు నెలలూ పొలిటికల్ ఎమర్జన్సీ అంటూ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు. కానీ ఎన్నికలకు వెళ్లే ముందు.. ఈ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోవాలి.. చేసినదాన్ని సరిగ్గా ప్రమోషన్ చేసుకోవాలి. చేయని దాన్ని కప్పిపుచ్చుకోవాలి.. అందుకే ఆ ప్రయత్నాల్లో భాగంగానే చంద్రబాబు శ్వేత వ్యూహం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.


.. అదే శ్వేత పత్రాల విడుదల. ఇదేమీ కొత్త వ్యూహమేమీ కాదు.. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఇలాగే శ్వేత పత్రాల హడావిడి చేశారు. ఇప్పుడు ఏపీలోనూ అదే చేయబోతున్నారు. మొత్తం పది అంశాలను ఎంపిక చేసుకుని ఆయా రంగాల్లో తాము సాధించిన ప్రగతిని చంద్రబాబు ప్రచారం చేయదలచుకున్నారు.



ఈ మేరకు మంత్రి వర్గంలో చర్చ జరిపారు. ఈ శ్వేత పత్రాల విడుదల జనవరి 2 నుంచి ప్రారంభమవుతుంది. వరుసగా పది రోజుల పాటు ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. రాష్ట్ర పునర్విభజన అంశాలు -అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటు, సాంఘిక సంక్షేమం, సాధికారత, రేషన్‌, ఎన్టీఆర్‌ భరోసా, చంద్రన్న బీమా, హౌసింగ్‌, ఉపకార వేతనాలు, ఆదరణ-2, అన్న క్యాంటీన్లు, పేదరికంపై గెలుపు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ వంటి అంశాలపై ఈ శ్వేతపత్రాలు విడుదల ఉంటుంది.



ఇవే కాకుండా రైతు సంక్షేమం, ఆహార భద్రత, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉబరైజేషన్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌.. పట్టణాల్లో కనీస సౌకర్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఓడీఎఫ్‌ ప్లస్‌, రాజధాని నిర్మాణ పురోగతి, మానవ వనరుల అభివృద్ధి, గవర్నెన్స్‌, ఆర్‌టీజీ... ఇలా పది రోజులపాటు అనేక అంశాలపై ప్రచారం సాగిస్తారు. మరి ఈ ప్రచారం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: