ఇప్పటికే జగన్ పాదయాత్రతో గడచిన 15 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పొటెత్తిపోతోంది. టెక్కలిలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటున్నారు. దానికితోడు ఈరోజు చంద్రబాబునాయుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో క్యాంపు వేస్తున్నారు. ధర్మపోరాట సభలో భాగంగా తెలుగుదేశంపార్టీ బహిరంగసభ నిర్వహిస్తోంది. అంటే ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతల బహిరంగసభలతో శిక్కోలు జిల్లా హోరెత్తిపోనున్నది. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ తన ప్రసంగంలో చంద్రబాబును టార్గెట్ చేస్తారనటంలో సందేహం లేదు. అదే సమయంలో చంద్రబాబు కూడా తన ఆరోపణలు, విమర్శలతో నరేంద్రమోడితో పాటు జగన్ మీదనే దృష్టి పెడతారు.

 

నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రం అనుకున్నంత స్ధాయిలో అభివృద్ధి జరగకపోవటానికి కేంద్రం అననుకూలతతో పాటు జగన్ వైఖరే కారణమని చంద్రబాబు ఎక్కడ చూసినా మండిపడుతున్నారు. నాలుగేళ్ళ పాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి నరేంద్రమోడి మంత్రివర్గంలో ఇద్దరు టిడిపి ఎంపిలకు మంత్రిపదవులు ఇచ్చుకున్నపుడు చంద్రబాబుకు ఆ విషయం గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండే మోడి రాష్ట్రాభివృద్ధికి సహకరించటం లేదంటూ ఊరూవాడ ఎక్కి అరుస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి ప్రధాన ప్రతిపక్షం వైసిపి కూడా అడ్డుపుడుతోందంటు మండిపడుతున్నారు.

 

ఇక్కడే చంద్రబాబు రెండు నాల్కల ధోరణి బయటపడుతోంది. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మళ్ళీ చంద్రబాబే చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని,  వైసిపి ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధి ఆగదని కూడా చంద్రబాబే అంటున్నారు. అంటే అభివృద్ధి విషయంలో చంద్రబాబు చెబుతున్న రెండు మాటల్లో ఏది కరెక్టో జనాలకు అర్ధం కావటం లేదు. మొత్తానికి పై ఇద్దరు నేతల తాకిడికి జిల్లా మాత్రం హోరెత్తిపోతోంది. గతంలో కూడా చంద్రబాబు, జగన్ ఇద్దరూ చంద్రగిరిలో ఓ పండుగ సందర్భంగా ఒకే రోజు క్యాంపు వేశారు. అది కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే. కాకపోతే ఆరోజు పండుగ కాబట్టి పాదయాత్ర జరగలేదు, సభలు కూడా ఏమీ లేదు. కానీ ఈరోజు మాత్రం గతానికి భిన్నంగా ఇద్దరూ బహిరంగసభల్లో పాల్గొంటుండటమే విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: