తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి..టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది.  తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని భూ స్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్న టి కాంగ్రెస్, టీటిడిపి,టిజెఎస్,సీపీఐ లతో జత కట్టి మహాకూటమిగా ఏర్పడింది.  కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలిచింది.  అయితే మహాకూటమి నుంచి  టిడిపి తరుపున పోటీ చేసిన  సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరావు ఇద్దరు గెలిచారు.  కాగా, టీడీపీ తరుపున అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నట్టు ఊహాగానాలు ఊపందుకోవడంతో దానిపై స్పందించారు. నాకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని వదిలి వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదు.

పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సారధ్యంలో ప్రజల కోసం పనిచేస్తా  అని తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో రాష్ట్రంలో వలసల ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం దీనికి బలం చేకూర్చే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గతంగా సమావేశమై రెండు గంటలపాటు చర్చించారు.

ఈ నెలాఖరున సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారబోతున్నారని, ఆయనతో పాటు నాగేశ్వరరావు కూడా పార్టీ మారుతారని కథనాలు వచ్చాయి. టీఆర్ఎస్‌లో ఇప్పటికే కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ నుంచి గెలిచిన 19మంది ఎమ్మెల్యేల్లో 12మంది టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనకు వచ్చారని.. సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు రహస్య మంతనాలు సాగించారని కథనాలు వచ్చాయి. కాగా పార్టీ మారడంపై వస్తున్న వార్తలు ఖండించారు మెచ్చా నాగేశ్వరరావు.  తాను టీడిపికి ఎప్పటికీ రుణపడి ఉంటానని..చంద్రబాబు సారథ్యంలో తెలంగాణలో టీడీపిని పటిష్టం చేయడానికి తన శాయశక్తులా పని చేస్తానని అన్నారు. దాంతో మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం లేదని తేలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: