ఏపీ అధికార పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రికి కూడా కంటిపై నిద్ర లేకుండా పోయింది! ఇది నిజం కూడా!! ఎక్క‌డికక్క డ నాయ‌కుల్లో అభ‌ద్ర‌తా భావం పెరిగిపోతోంది. అయితే, ఈ అభ‌ద్ర‌త ఏదో ప్ర‌జ‌ల్లో తాము విజ‌యం సాధించ‌లేమ‌నో.. లేక ప్ర‌జ‌లు త‌మ‌ను ఓడిస్తార‌నో కాదు.. పార్టీ నుంచే వారికి అభద్ర‌త ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పైకి బాహాటంగా చెప్ప‌లేక పోతున్నా.. టీడీపీ సిట్టింగులు చాలా మంది.. త‌మ‌లో తామే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌. ``మా అధినేత తీరు మ‌మ్మ‌ల్ని స్థిమితంగా ఆలోచ‌న చేయ‌నీయ‌డం లేదు!`` అని మీడియా మిత్రుల వ‌ద్ద పేరు రాకూడ‌ద‌నే ష‌రతుతో వ్యాఖ్యానిస్తున్న ఎమ్మెల్యేలు ప‌దుల సంఖ్య‌లో ఉన్నారు. పోనీ.. చంద్ర‌బాబును వారు త‌ప్పు ప‌డుతున్నారా ? అంటే అదేమీ లేదు. ఆయ‌నంటే వారికి అమిత‌మైన గౌర‌వం ఉంది.


అస‌లు.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో తీవ్ర టెన్ష‌న్‌తో ర‌గిలిపోతున్న నాయ‌కుడు ఒకాయ‌న‌ను క‌దిపితే.. చంద్ర‌బాబు అంటే. త‌న‌కు ఎంత గౌర‌వ‌మో కోర‌కుండా గంట‌ల కొద్దీ చెబుతున్నారు. కానీ, ఆయ‌న‌కు మాత్రం కంటిపై కునుకు లేకుండా పోతోంది. మేం ప్ర‌జ‌ల్లోనేఉంటాం. మా డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తాం. అవ‌స‌ర‌మైతే.. మా అబ్బాయి ఉద్యోగం మాన్పించి అమెరికా నుంచి కూడా తీసుకు వ‌చ్చి.. ఇక్క‌డ పార్టీ కోసం కృషి చేసేలా చేస్తాను. వైసీపీ నేత‌ల‌కు డిపాజిట్లు రాకుండా కూడా చేయ‌గ‌ల‌ను. అంతేకాదు.. ఎంత డ‌బ్బ‌యినా ఖ‌ర్చు చేస్తాను. ఉన్న పొలాన్ని కూడా అమ్మేస్తాను.. కానీ.. !! అంటూ .. ఆగిపోతున్న నాయ‌కులు ప‌దుల సంఖ్య‌లో క‌నిపిస్తున్నారు. మ‌రివీరిలో ఇంత‌గా నిద్రాణంగా ఉన్న స‌మ‌స్య ఏంటి? 


ఎందుకు ఇంత‌గా అటు చంద్ర‌బాబుకు, ఇటు నేత‌లు త‌మ‌కు తాము త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డేలా ప‌రిస్థితి వ‌స్తోంది? అని త‌ర్కిస్తే.. కేవ‌లం ఒకే ఒక పాయింట్ క‌నిపిస్తోంది. ఇప్పుడున్న సిట్టింగుల‌కు టికెట్లు వ‌స్తాయ‌నే ఆశ‌లు కానీ, భ‌రోసా కానీ క‌నిపించ‌క పోవ‌డ‌మే! ఆది నుంచి కూడా చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రితో వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతూనే ఉన్నారు. అంద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్ప‌డానికి బ‌దులుగా చంద్ర‌బాబు కొంద‌రికి మాత్ర‌మే కితాబు నివ్వ‌డాన్ని వారు స‌హించ‌లేక పోతున్నారు. ``నిజ‌మే .. ఆయ‌న‌కు చంద్ర‌బాబు, లోకేష్‌ల వ‌ద్ద నేరుగా ఉన్న ప‌రిచ‌యాల‌తో తాను చేసింది చెప్పుకొంటున్నాడు. కానీ, మాకు డైరెక్ట్ యాక్సిస్ లేదు. పోనీ.. మేం వెళ్లినా అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌``ని ఆవేద‌న చెందుతున్న వారు కూడా ఉన్నారు. మ‌రి ఇలాంటి వారిని చేర‌దీసి బుజ్జ‌గించ‌డ‌మో.. లేదా వారిలో భ‌రోసాని నింప‌డ‌మో చేయ‌డం ద్వారా బాబు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని కోరుతున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. మ‌రి బాబు ఆ దిశ‌గా దృష్టి పెడ‌తారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: