ప్ర‌జ‌లు ఎప్పుడూ ఒకే లా ఉండ‌రు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌నిపిస్తోంది. అర‌చేతిలోకి స‌ర్వ ప్ర‌పంచం అందుబాటులోకి వ‌చ్చాక ప్ర‌జ‌లు అన్ని ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలుసుకుంటున్నారు. ఎవ‌రు ఎలాంటి నాయ‌కులో ప‌సిగ‌డుతున్నారు. దీంతో గ‌తంలో మాదిరిగా కాకుండా.. ఇప్పుడు చైత‌న్య వంతులు అవుతున్నారు. అదేస‌మ‌యంలో గ‌తంలో మాదిరిగా నాయ‌కుల బెదిరింపుల‌కు, హెచ్చ‌రింపుల‌కు కూడా ఛాన్స్ ఇవ్వ‌కుండా.. త‌మ సొంత నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నా రు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న పెరిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అక్క‌డా ఇక్క‌డా అనే తేడా లేకుండా ప్ర‌జ‌లు చైత‌న్యం చూపిస్తు న్నారు. రాష్ట్రంలో కీల‌క‌మైన అనంత‌పురం జిల్లాలో త‌మ‌కు తిరుగులేద‌ని భావిస్తున్న‌(నిజంగానే తిరుగులేదు) జేసీ బ్ర‌దర్స్‌కు రాజ‌కీయంగా గ‌డ్డుకాలం ఎదుర‌వుతోం ద‌ని తెలుస్తోంది. 


తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గాన్ని కొన్ని ద‌శాబ్దాలుగా జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్‌లు ఏలుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు సోద‌రులు అనంత‌పురం ఎంపీగా ఒక‌రు, తాడిప‌త్రి ఎమ్మెల్యేగా ఒక‌రు చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రి ఇన్ని ద‌శాబ్దాలుగా పార్టీలు ఏవైనా స‌రే ప్ర‌జ‌లు వీరిని ఆద‌రిస్తున్నారు. కానీ, ఇక్క‌డ క‌న్నుపొడుచుకుని చూసినా.. అభివృద్ధి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప్ర‌జ‌లు. తాడిప‌త్రిలో 1985 నుంచి 2009 వ‌ర‌కు కూడా జేసీ దివాక‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. ఇక‌, 2014లో వీరు కాంగ్రెస్‌ను విడిచి పెట్టి టీడీపీలో చేరిపోయారు. వ్య‌క్తులుగా ఉన్న వీరు శ‌క్తులుగా మార‌డంతో ఇక్క‌డ వీరు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా గెలుస్తున్నారు. ఈ ఇద్ద‌రు సోద‌రులు గ‌త ఎన్నిక‌ల్లోటీడీపీ త‌ర‌ఫున ఒక‌రు ఎంపీగాను, ఒక‌రు ఎమ్మెల్యేగాను విజ‌యం సాధించారు.ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. 


ఇద్ద‌రు సోద‌రులు వారివారి వార‌సు ల‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం వీరి హ‌వా ఎలా ఉంది?  వీరి ప‌ట్ల ప్ర‌జ‌ల సానుకూల‌త ఎలా ఉంది? వ‌ంటి అంశాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా స‌ర్వే చేయించారు. గ‌తంలో వీరికి ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు చెదిరిపోయింద‌నే సంచ‌ల‌న వాస్త‌వం వెలుగు చూసింది. గ‌డిచిన నాలుగేళ్ల‌లో వీరు ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీలేద‌ని చెప్పుకొచ్చార‌ట ప్ర‌జ‌లు. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయ‌ని, గ‌తంలో వైఎస్ హ‌యాంలో ప్రారంభానికి నోచుకున్న ప్రాజెక్టుల‌ను సైతం అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ప‌ట్టించుకోలేద‌ని చెప్పుకొచ్చారట‌. ఇక‌, ఈ నాలుగేళ్ల‌లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ప‌లు వివాదాలకు కార‌ణంగా మారారు. అవి చిన్న‌వే అయినా పెద్దగా చేస్తూ.. వారి ఉనికి కోసం పాకులాడుతున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం తాజాగా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు.


``వారికి వ‌య‌సు పెరుగుతున్నా.. ఆలోచ‌న‌లు మాత్రం పెర‌గ‌డం లేదు!``- అని బాబు చుర‌క‌లు అంటించారంటే.. జేసీ బ్ర‌ద‌ర్స్ ప‌ని దాదాపు కొలిక్కి వ‌చ్చిన‌ట్టేన‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. దీపావ‌ళి నేప‌థ్యంలో స్థానిక ఆశ్ర‌మ నిర్వాహ‌కుల‌తో గొడ‌వ‌కు దిగిన జేసీ.. అటు ఆయ‌న ప‌రువుతోపాటు పార్టీ ప‌రువును బ‌జారుకు ఈడ్చారు. ఇక‌, పోలీసుల‌ను హీనంగా మాట్లాడి ప్ర‌భుత్వ ప‌రువును పాడు చేశారు. పోనీ.. ప్ర‌జ‌ల్లో సంక్షేమ ప‌థ‌కాల‌ను ఏమ‌న్నా విస్తృతంగా తీసుకు వెళ్తున్నారా? అంటే.. అది కూడా స‌ర్వేల్లో స్ప‌ష్టంగా క‌నిపించ‌డం లేదు. టీడీపీ శ్రేణుల‌ను క‌లుపుకొని ముందుకు వెళ్తున్నారా? అంటే ఇది లేక‌పోగా.. టీడీపీలోనే ఎగ‌స్పార్టీని ఎగ‌దోస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల‌తో వివాదాలు పెట్టుకుని పార్టీని స‌మ‌న్వ‌యం చేయ‌క‌పోగా ఉన్న స‌మ‌న్వ‌యాన్ని కూడా చెడ‌గొడుతున్నారు. ఈ నేప‌థ్యంలో జేసీ బ్ర‌ద‌ర్స్ వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేద‌ని సాక్షాత్తూ చంద్ర‌బాబే వ్యాఖ్యానించేలా ప‌రిస్థితి ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: