ప్రతి ఎన్నికకు ఓ విధానం ఉంటుంది.  అయిదేళ్ళకు ఓ మారు ప్రజల దగ్గరకు వెళ్ళినపుడు వారిని ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు, అందులో అధికారంలో ఉన్న పార్టీకి అది అసలు సాధ్యం కాదు. అందువల్ల మారిన కాలానికి తగినట్లుగా మ్యానిఫేస్టోను తయారుచేసుకోవాలి. జనం మెచ్చేలా దాన్ని నిలబెట్టి ఓట్ల పంట పండించుకోవాలి. ఏపీలో ముఖ్యమంత్రి, చంద్రబాబు ఇపుడు ఆ దిశగా  భారీ కసరత్తే చేస్తున్నారు.


హోదా బ్రహ్మాస్త్రం :


ప్రత్యేక హోదా అన్నది ఇపుడు విపక్షాన అమ్ముల పొది నుంచి జారి పడి అధికార టీడీపీ వైపుగా వచ్చేసింది. ఇలా అనేకంటే ఒడుపుగా చంద్రబాబు దాన్ని తన వైపునకు తిప్పుకున్నారని అనడం సబబు. ఇపుడు అదే హోదాను బ్రహ్మాస్త్రంగా విపక్షాల మీదకే వాడబోతున్నారు. టీడీపీ బీజేపీతో ఉన్నంత కాలం వైసీపీ సహా ఇతర పక్షాలు ఓ రేంజిలో హోదాపై ఉద్యమాలు చేస్తూ వచ్చాయి, ఎపుడైతే టీడీపీ హోదా అంటూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆ పార్టీ ఆయుధంగా చేసుకుంది. రేపటి ఎన్నికల్లో దాన్ని గట్టిగా ప్రయోగించాలనుకుంటోంది. అందుకు తెలంగాణా ఎన్నికల్లో కేసీయార్ అనుసరించిన ఫార్ములానే ఇపుడు ఏపీలోనూ అనుసరించాలనుకుంటోంది. 


హోదా వ్యతిరేకులు :


కేంద్రంలోని మోడీ హోదా ఇవ్వలేదు, తెలంగాణా సీఎం కేసీయార్ హోదా వద్దంటున్నారు. ఆ ఇద్దరితో కలసిన వైసీపీ, జనసేన హోదా మీద ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. హోదా వ్యతిరేకి కెసీయార్ గెలిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుందని ఆయన విమర్శంచడం  వెనక హోదాకు వైసీపీని పూర్తిగా దూరం చేయడమే కనిపిస్తోంది. ఇక మోడీని వదిలేసిన బాబు కాంగ్రెస్ తో జట్టు కట్టారు. బాబు ఉన్న కాంగ్రెస్ లో వైసీపీ  ఎటూ ఉండదు, దాంతో మోడీతో వైసీపీని కలిపి కట్టేసి మరీ బాబు సంధిస్తున్న బాణాలు ఇపుడు ఆ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నాయంటున్నారు.


సంక్షేమ పధకాలు :


ఇక మరో వైపు కేసీయార్ తెలంగాణాలో సంక్షేమ పధకాలు పెద్ద ఎత్తున అమలు చేసి గెలిచారు. అదే తీరున ఏపీలో కూడా ఉన్న కార్యక్రమాలు అదనంగా మరిన్ని కొత్తగా ఎన్నికలో లోపే చేర్చి జనాదరణను చూరగొనాలని టీడీపీ పధక రచన చేస్తోంది. ఇందుకోసం భారీ కసరత్తునే చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే జనవరిలోనే కొత్త పధకలు జనాలకు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎన్నికల వేళ ఓ వైపు సెంటిమెంట్, మరో వైపు సంక్షేమం రెండూ జోడు గుర్రాల్లా పరుగులు తీయిస్తూ జనంలోకి పోవాలని టీడీపీ వ్యూహ రచన చెస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: