ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అసలు సిస‌లు ప‌రీక్ష మొద‌లు కానుందా.? ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న‌కు అస‌లు కేడ‌రే లేకుండా పోయిందా? అంటే ఔన‌నే సంకేతాలే వినిపిస్తున్నాయి. ప్ర‌దానంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరుల్లో జ‌న‌సేన పాగా వేయ‌డం అంత ఆషామాషీ విజ‌షం కాదు. పైగా ప‌వ‌న్ చెబుతున్న‌ట్టు మార్పు రావాలి-మార్పు కావాలి! అని కోరుకుంటున్న వారు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో భ‌రోసానింపే నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో లేన‌ప్పుడు ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు? ఇదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న.

రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 7 నుంచి 8 జిల్లాల్లో మాత్రం పూర్తిగా ప‌ర్య‌టించారు. వీటిలోనూ కొన్ని జిల్లాల్లో అంటీ ముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. మిగిలిన నాలుగు జిల్లాల ప‌రిస్తితి ఏంటి?  చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జ‌న‌సేన ఉనికి ఎక్క‌డ‌? జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డ‌? అనే ప‌రిస్థితి వ‌స్తోంది. కేవ‌లం శ్రీకాకుళం, ఉభ‌య గోదావ‌రులు, అనంత‌పురం జిల్లాల‌నే ప‌వ‌న్ టార్గెట్ చేసుకుని ప‌ర్య‌టించారు. మ‌రి అధికారంలోకి రావాల‌నుకున్న ప‌వ‌న్‌కు మిగిలిన జిల్లాల‌తో సంబంధం లేదా?  ఆ జిల్లాల్లో గెల‌వాల్సిన అవ‌స‌రం లేదా? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇక‌, ఆయా జిల్లాల్ల ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలే గెలుపు గుర్రాల కోసం జల్లెడ ప‌డుతున్నాయి. 

వాస్త‌వానికి ఆయా పార్టీల‌కు బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. గ‌తంలో గెలిచిన వారు ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న వారు కూడా ఉన్నారు. అయినా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత‌గా బ‌ల‌మైన అభ్య‌ర్థులు ల‌భిస్తారేమోన‌ని ఈరెండు పార్టీలూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో అస‌లు ఉనికే లేని జ‌న‌సేన‌కు ల‌భించే నాయ‌కుల స్థాయి ఏమిటి?  వారిని న‌మ్ముకుని జ‌న‌సేన ఎలా అధికారంలోకి వ‌స్తుంది?  అనే కీల‌క ప‌రిణామాల‌కు, ప్ర‌శ్న‌ల‌కు జ‌న‌సేన నేత‌ల వ‌ద్ద కానీ, అధినేత ప‌వ‌న్ వ‌ద్ద కానీ స‌మాధానం ల‌భించ‌డం లేదు. దీంతో వ‌చ్చే మూడు మాసాలు ఆయా జిల్లాలు జ‌న‌సేన‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారుతాయ‌న‌డంలో సందేహం లేదేని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌వ‌న్ ఎలా  ముందుకు వెళ్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: