తెలుగుదేశంపార్టీతో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత మెల్లిగా బయటపడుతోంది. ఒక్కో నేత ఒక్కో సమావేశంలో టిడిపిపై వ్యతిరేకతను బయటపెడుతున్నారు. తాజాగా సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్, టిడిపి పొత్తులను జనాలు పూర్తిగా వ్యతిరేకించినట్లు చెప్పారు. తెలుగుదేశంపార్టీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పొత్తులు పెట్టుకోవటాన్ని జనాలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు అభిప్రాయపడ్డారు. అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని కూడా బైరెడ్డి తేల్చేశారు.

 

తెలంగాణాలో అనుభవం చూసిన తర్వాత ఏపిలో మళ్ళీ టిడిపితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని బైరెడ్డి చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ అన్నీ నియోజకవర్గాల్లో ఒంటిరిగానే పోటీ చేస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.  నిజానికి టిడిపి, కాంగ్రెస్ పొత్తుల గురించి మాట్లాడే స్ధాయి కాదు బైరెడ్డిది. కానీ విచిత్రంగా పొత్తులండవని బాహాటంగానే బైరెడ్డి చెప్పేస్తుండటమే విడ్డూరంగా ఉంది. బైరెడ్డి టిడిపితో పొత్తులుండవని చెప్పారంటే పార్టీలోని ఇతర సీనియర్ నేతల్లో కూడా అదే అభిప్రాయం ఉందనే అనుకోవాలి. కాకపోతే పొత్తుల విషయం  చంద్రబాబు రాష్ట్రంలోని ఏ నేతతోను మాట్లాడకుండా నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధితోనే మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే.

 

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాలను త్వరలో జనాల్లోకి తీసుకెళ్ళటంలో భాగంగా బస్సుయాత్ర మొదలుపెడతారట బైరెడ్డి జిల్లాలో. రైతులకు రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ, చౌకదుకాణాల్లో సోనా మసూరి బియ్యం పంపిణి, మూడు నెలలకు ఓ గ్యాస్ సిలిండర్ ఉచితం లాంటి హామీలను బైరెడ్డి జనాల్లోకి తీసుకెళతారట. పనిలో పనిగా మోడితో పాటు చంద్రబాబును కూడా బైరెడ్డి విమర్శించేశారు. మోడి నియంతలాగ వ్యవహరిస్తున్నారట. క్రిస్మస్ కానుక పేరుతో పేద దళితులకు దగ్గరవ్వటానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను జనాలు నమ్మరని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింటేమిటంటే, అధిష్ఠానం ఆదేశిస్తే  పులివెందులలో జగన్మోహన్ రెడ్డిపైన లేకపోతే కుప్పంలో చంద్రబాబుపైన కూడా పోటీకి సిద్ధమంటూ ప్రకటించేశారు. నిజానికి బైరెడ్డిని కర్నూలు జిల్లాలో మరచిపోయే చాలాకాలమైంది. అటువంటిది పులివెందుల, కుప్పంలో పోటీకి రెడీ అంటుండటమే పెద్ద జోక్.


మరింత సమాచారం తెలుసుకోండి: