వైసీపీ అధినేత పాదయాత్ర నిరాటంకంగా 2018 ఏడాది మొత్తం సాగింది. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడున్నర వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుని తొందరలో ఇచ్చాపురం గమ్యానికి చేరనుంది. అప్పటికి 2019 కొత్త సంవత్సరం వస్తుంది. జగన్ పాదయాత్ర అలా 2017, 2018, 2019 మూడేళ్ళలోనూ కొన‌సాగినట్లవుతోంది. 


నిరాశ నుంచి :


ఇక వైసీపీ గురించి చెప్పుకోవాలంటే 2017లో పూర్తి నిరాశావహమైన వాతావరణం ఆ పార్టీని ఆవహించింది. ఆగస్ట్ లో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంధ్యాల  ఉప ఎన్నికలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దాంతో జగన్ పార్టీని పటిష్టం చేసేందుకు  సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాంతో 2018 నిరాశ నుంచి ఆశ వైపుగా అడుగులు వేస్తూ జగన్ పాదయాత్ర సాగింది. . మొత్తం పన్నెండు నెలలు పూర్తి అయ్యేటప్పటికి జగన్ పాదయాత్ర సూపర్ హిట్ అయింది.
అన్ని జిల్లాలో తరగని ఆదరణతో జగన్ ముందుకు సాగుతున్నారు. టీడీపీకి ధీటైన జవాబు ఇచ్చేలా పార్టీని జగన్ సిధ్ధం చేశారు. నంధ్యాల ఉప ఎన్నికతో ఇక  ఏపీ గాలి టీడీపీ వైపే  అన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చడంలో 2018 జగన్ కి బాగా ఉపయోగపడింది. జగన్ సైతం అలుపెరగకుండా పాదయాత్రను నిర్వహిస్తూ జనంలోకి దూసుకుపోవడం పార్టీకి శ్రీరామ రక్షగా మారింది.


అక్కడ సక్సెస్ :


జగన్ ప్రత్యేక హోదా పోరాటం ఎంతవరకూ వెళ్ళిందంటే ఒక్కటిగా ఉన్న బీజేపీ టీడీపీ విడిపోయేంతవరకు అని చెప్పాలి. ఈ ఏడాది మొదట్లో ఎవరూ అనుకోలేదు ఆ పొత్తు పెటాకులు అవుతుందని. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ అవిశ్వాస తీర్మానం మోడీపై పెట్టడం. దాంతో టీడీపీ కొత్త స్టాండ్ ని తీసుకుని బీజేపీ నుంచి బయటకు రావడం జరిగిపోయాయి. ఇది నిజంగా జగన్ పెట్టిన ఒత్తిడి ఫలితమే అని చెప్పాలి. ఇక మరో వైపు కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేయడం, తెలంగాణాలో జత కట్టి ఘోరంగా ఓడిపోవడం వైసీపీకి మోరల్ బూస్ట్ గా భావించాలి.


జనసేన కలవరం :


మరో వైపు టీడీపీ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టిన జనసేన వైసీపీలో కలవరం రేపుతోంది. ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే ప్రభుత్వ ఓటు చీలుతుందని, ఆ విధంగా నష్టం జరుగుతుందని భావిస్తోంది. అదే సమయంలో పవన్ జగన్ని వ్యక్తిగతంగా చేసుకుని ఎక్కుపెట్టిన విమర్శలు కూడా చికాకు పెట్టాయి. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని పవన్ తరచూ తప్పు పట్టడం మైనస్ ఆ మారుతోంది. ఇక కాపులకు రిజర్వేషన్లపై జగన్ తూర్పు గోదావరి జిల్లాలో ఇచ్చిన స్టేట్మెంట్ కొంత ఇబ్బంది పెట్టినా చివరికి సర్దుకుపోయింది. అయితే ఈ అంశం ప్రభావం ఏంటన్నది ఎన్నికల్లోనే చూడాలి. 


కేసీయార్, మోడీతో లింకులు :


ఇక జగన్ పార్టీ విషయంలో రాజకీయ పొత్తులు వ్యూహాలపైన మాత్రం విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు బీజేపీలోనుంచి బయటకు రాగానే మోడీతో కలిపి జగన్ కి లింక్ పెట్టేశారు. ఇక కొత్తగా టీయారెస్ తోనూ, కేసీయార్ తోనూ కూడా జట్టు కట్టించి మరీ జనంలో సందేహాలు పెంచగలిగారు. వాటికి వైసీపీ నుంచి ధీటైన సమాధానం మాత్రం రాకపోవడం పట్ల జనంలో అనుమానాలు ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో లేని కొత్త స్నేహాల అపోహలు చివరిలో ఇలా వైసీపీని వెన్నాడడం గమనార్హం.


హత్యాయత్నం :


జగన్ పై హత్యాయత్నం జరగడం ఈ ఏడాదిలో అతి పెద్ద సంచలనం. విశాఖ విమానాశ్రయంలో అక్టోబర్ 26న జగన్ పై కోడి కత్తితో ఆగంతకుడు శ్రీనివాస్ దాడి చేశారు. దాంతో త్రుటిలో జగన్ తప్పించుకున్నా అది పెద్ద ప్రకంపనలే రేపింది. ఈ విషయం ఇపుడు కోర్టులో ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాది జగన్ కి ఆశావహంగా, భవిష్యత్తు వైసీపీదేనన్న ధీమాను పెంచే విధంగా ఉండడం విశేషం. 2019 అధికారం అందిస్తుందన్న భారీ అంచనాలతో వైసీపీ న్యూ యియర్ కి స్వాగతం పలుకుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: