అధికారంలోకి మేం వ‌స్తామంటే.. మేమొస్తామంటూ.. పోటీ ప‌డుతున్న టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. ఏపీలో రాబోయే ఐదేళ్ల‌పాటు నిప్పులపై న‌డ‌క త‌ప్ప‌దా?  రాష్ట్రాన్ని పాలించ‌డం అంత ఈజీకాదా? ప‌్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం చెప్పినంత ఈజీకాదా?  అంటే.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, స‌మ‌స్య‌లు, ప్రాజెక్టులు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గ‌మ‌నిస్తున్న జాతీయ మీడియా ఔన‌నే అంటోంది. వ‌చ్చే ఐదేళ్లు ఏపీని పాలించ‌బోయే నాయ‌కులు నిప్పుల మీద న‌డ‌వాల్సిందేన‌ని చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణాలుగా ఇప్పుడున్న స‌మ‌స్య‌ల‌కు తోడు కొత్త‌గా రాబోయేవి కూడా మ‌రింత జ‌ఠిలం కానున్నాయ‌ని అంటున్నారు. 2014 నాటి లెక్క‌ల ప్ర‌కారం ఏపీ 16 వేల కోట్ల రూపాయ‌ల లోటు బ‌డ్జెట్‌లో ఉంది. 


దీనిని కేంద్ర‌మే ఇవ్వాల్సి ఉన్నా.. వివిధ కార‌ణాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 2500 కోట్లు మాత్ర‌మే జ‌మ చేసింది. పైగా త‌మ లెక్క‌ల ప్ర‌కారం 4000 కోట్లు మాత్ర‌మే లోటు బ‌డ్జెట్ అని పేర్కొంటోంది. ఇదిలావుంటే, ప్ర‌స్తుత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా అమ‌లు చేస్తోంది.దీనికి సంబందించి అందిన కాడికి అప్పులు తెస్తున్నారు. రాజ‌ధాని బాండ్ల‌ను సైతం విక్ర‌యించారు. ఇక‌, రాజ‌ధాని అపార్ట్‌మెంట్ల‌ను క‌ట్టిస్తామ‌ని చెబుతూ వ‌సూలు చేస్తున్న మొత్తాల‌ను కూడా వివిధ ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నారు. ఇలా ఎన్ని చేస్తున్నా.. నిదుల స‌ద్వినియోగంలో చ‌తికిల ప‌డుతున్నారు. 2014లో ఇచ్చిన రైతు రుణ మాఫీ ప్ర‌యోగం ఇప్ప‌టికీ కార్యాచ‌ర‌ణ‌కు నోచుకోలేదు. డ్వాక్రా రుణ మాఫీ చేయాల్సి ఉంది. వీటికి గాను మ‌రో 3000 కోట్ల మేర‌కు అప్పులు చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. 


ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు ఉన్న ఎఫ్ ఆర్ ఎం బీ రుణాల‌కు మించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్పులు తెచ్చింది. నాబార్డు నుంచి అంచ‌నాల‌కు మించిన రుణాల‌ను తీసుకుంది. ఇవ‌న్నీ తీర‌క‌పోతే..కొత్త‌గా అప్పు పుట్టే ప‌రిస్తితి లేదు. ఇక‌, కొత్త‌గా ఏర్ప‌డ‌బోయే ప్ర‌భుత్వాల‌కు రుణాలు ద‌క్కే ప‌రిస్థితి అటుంచితే.. ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న రుణాల‌కు వ‌డ్డీలు చెల్లించేందుకు ఆదాయంలో స‌గ‌భాగం పోతుంద‌ని ఆర్థిక నిపుణులు ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే తీసుకుంది. ఈ నిర్మాణం ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం 50% కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా రాజ‌ధాని నిర్మాణం, ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు, విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, సామాజిక పింఛ‌న్లు వంటివి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెర‌గ‌నున్నాయి. 


మ‌రోపక్క‌, ప్ర‌తి సామాజిక వ‌ర్గానికి కార్పొరేష‌న్ ఉన్న నేప‌థ్యంలో ఏటా వాటికి కేటాయించాల్సిన నిధులు.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, న‌గ‌రాల అభివృద్ది వంటివ‌న్నీ కూడా కొత్త‌గా ఏర్ప‌డ‌బోయే ప్ర‌భుత్వానికి ప్రాణ‌సంక‌టంగానే ప‌రిణ‌మించ‌నున్నాయి. ఇక్క‌డ చంద్ర‌బాబా, జ‌గ‌నా... ప‌వ‌నా.. అనే స‌మ‌స్య కాకుండా ఆర్థికంగానే అనేక స‌మ‌స్య‌లు రాష్ట్రాన్ని చుట్టుముట్ట‌నున్నాయి. వీట‌న్నింటికీ తోడు ఉద్యోగుల జీత భ‌త్యాల పెంపు, కొత్త ఉద్యోగాల క‌ల్ప‌న‌, నియామ‌కాలు వంటివి క‌త్తిమీద సాముగా మార‌నున్నాయి. ఇవ‌న్నీ త‌ట్టుకుని పాలించ‌డం ఒక ఎత్త‌యితే.. ప‌క్క‌రాష్ట్రంతో సంబంధాలు అంటే తెలంగాణాతో ఆస్తుల వివాదాల‌కు కూడా స‌మ‌యం 10 సంవ‌త్స‌రాల కాలం తీరిపోతుంది. ఈ స‌మ‌యంలో అక్క‌డ నుంచి రావాల్సిన నిదులు, ఆస్తుల పంప‌కాల‌ను సాధించ‌డం అనేది కూడా మ‌రో పెద్ద స‌మ‌స్య‌. ఇలా ఎలా చూసినా.. ఏపీలో ఏర్ప‌డ బోయే ప్ర‌భుత్వానికి అన్నీ స‌మ‌స్య‌లే పొంచి ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. నిద్ర‌ప‌ట్ట‌ని రాత్రులు గ‌డ‌పాల్సిందేన‌ని అంటున్నారు. మ‌రి ఎవ‌రు ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: