వైసీపీకి అతి ధీమా పెరిగింది. రేపటి ఎన్నికల్లో గెలుపు మాదేనని ఆ పార్టీ నేతలు అపుడే అంచనాకు వచ్చేశారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగి తామే పీఠం ఎక్కుతామని గట్టిగా నమ్ముతున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలోనూ , జాతీయ స్థాయిలోనూ మారుతున్న పరిస్థితులను ఆ పార్టీ నేతలు సరిగ్గా అంచనా వేసుకోవడంలేదు.


ఆ సర్వే షాక్ :


వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉండబోతుందనే రిపబ్లిక్ సర్వే సీ ఓటర్ తో కలసి  అంచనాలు వెలువరించింది. బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఏకం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీడీపీకి కొంత అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఏపీలో మొత్తం 25పార్లమెంటు స్థానాలకు గానూ వైసీపీ 14 సీట్లను గెలుపొందుతుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. మిగతా 11 సీట్లను టీడీపీ- కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పింది. వీటిలో 8 టీడీపీ, 3 కాంగ్రెస్ దక్కించుకుంటాయని వెల్లడించింది. ఇది నిజంగా వైసీపీకి షాకే 


అప్పట్లో అలా :


అయితే, మొన్నటి వరకు వైఎస్ జగన్‌కి అనుకూలంగా ఉందని, తీర్పు ఏకపక్షమేనని అంచనా వేసినా కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిన తర్వాత చంద్రబాబు మళ్లీ లైన్‌లోకి వచ్చారని తెలిపింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి ప్రభావం ఏపీలో ఉండబోదని స్పష్టం చేసింది. వైసీపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీ- కాంగ్రెస్ కూటమికి 38.2 శాతం ఓట్లు దక్కించుకుంటుందని, బీజేపీకి 11 శాతం, ఇతరులు 9.3 శాతం ఓట్లు దక్కించుకుంటారని పేర్కొంది. అయితే, అక్టోబరులో రిపబ్లిక్ టీవీ సర్వేలో వైసీపీ 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది.  దీన్ని బట్టి చూస్తూంటే వైసీపీ ఊపు తగ్గిపోయినట్లుగానె భావించాలి.


పొత్తుల ప్రభావం :


కానీ రెండు నెలలు తిరక్కముందే పరిస్థితి అనూహ్యంగా మారిపోయిందని, టీడీపీ తన స్థానాలకు 8కి పెంచుకోవడమే కాదు, మిత్రపక్షం కాంగ్రెస్‌తో కలిసి మొత్తం 11 సీట్లను గెలుచుకోనుందని అంచనా వేసింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేసిన బీజేపీ ఏపీలో 2 పార్లమెంటు స్థానాలను చేజిక్కించుకుంది. కానీ, ప్రస్తుతం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేయడంతో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదు కదా డిపాజిట్లు కూడా దక్కవని సర్వే తెలియజేసింది. మరి కాంగ్రెస్ తో పొత్తులు టీడీపీకి ఏ విధంగానూ కలసిరావని భావిస్తున్న వారికి ఈ సర్వే నివేధికలు ఖంగు తినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: