వంగ‌వీటి రాధాకృష్ణ‌. రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు విస్తృతంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పేరు ఇది! బెజ‌వాడ బెబ్బులి మాదిరిగా రాజ‌కీయాలు చేసిన కాపు ఉద్య‌మ సార‌ధి, పేద ప్ర‌జ‌ల ఆశాజ్యోతిగా వెలుగొందిన వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన రాధా.. రాజ‌కీయాల‌పై తాజాగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఆయ‌న ఈ రోజు రేప‌ట్లోనే ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి ప్ర‌స్తుతం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వైసీపీ నుంచి రాధా బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే అస‌లు రాధా రాజ‌కీయ జీవితంలో ఉత్థాన ప‌త‌నాలు, వీటికి దోహ‌ద ప‌డిన విష‌యాలు, కార‌ణాలు వ్య‌క్తులు.. ఎవ‌రెవ‌రు ఉన్నారు? అనే కీల‌క విష‌యాల‌పై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. 


రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన చేసిన రాధా.. కేవ‌లం రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. త‌న తండ్రి లాగా అన్ని సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోవ‌డం, పేద‌ల‌కు, బ‌డుగుల‌కు ద‌గ్గ‌ర కావ‌డం అనేది ఆయ‌న చేయ‌లేక పోయారు. దీంతో రాధా రంగా మాదిరిగా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోయారు. ఇక‌, యువ‌కుడిగా ఆయ‌న దూకుడు కూడా రాజ‌కీయంగా ఆయ‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేసింది. 2004 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. అయితే, ఆ త‌ర్వాత మాత్రం ఆయ‌న వేసిన అడుగులు ఆయ‌న‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. 2009లో ప్ర‌జారాజ్యంలోకి రావ‌డం, కాంగ్రెస్‌ను ఓడించేలా వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి ఆయ‌న‌కు కాంగ్రెస్ కేడ‌ర్‌ను దూరం చేశాయి 


ఇక‌, ఆ త‌ర్వాత ఆయ‌న విజ‌యం సాధించ‌లేక పోయారు. దీంతో వైసీపీలోకి చేరారు. వాస్త‌వానికి రంగాలోని రాజ‌కీయ చ‌తుర‌త తెలిసిన వాళ్లు ఆయ‌న ఎక్కడ నిల‌బ‌డ్డా గెలిచే రేంజ్‌కు ఎదిగారు. ఈ చోటు.. ఆ చోటు ఈ నియోజ‌క‌వ‌ర్గం, ఆ నియోజ‌క‌వ‌ర్గం అనే తేడా లేకుండా ఆయ‌న దూసుకు పోయారు. కానీ, రాధా మాత్రం కేవ‌లం త‌న‌కు ఈ నియ‌జ‌క‌వ‌ర్గమే కావాల‌నే గిరిగీసుకుని రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇక‌, గ‌తంలో రంగాకు అనుచ‌రులుగా, ఆయ‌న వ‌ద్ద పాఠాలు నేర్చుకున్న వారు కూడా ఇప్పుడు టికెట్ విష‌యంలో రాధాకు అడ్డుత‌గులుతున్నారు. సెంట్ర‌ల్‌లో టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్టిన మ‌ల్లాది విష్ణు ఒక‌ప్పుడు రంగా అనుచ‌రుడిగా మెలిగారు. ఇప్పుడు ఈయ‌నే రాధాకు టికెట్ విష‌యంలో అడ్డు త‌గులుతున్నారు. 

అదేవిధంగా ఒకే పార్టీలో ఉండి రంగాను తిట్టిపోసి.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పూనురు గౌతం రెడ్డి కూడా త‌క్కువేమీ కాదు. అదేస‌మ‌యంలో రంగాతో స‌న్నిహితంగా మెలిగిన చాలా మంది నాయ‌కులు నేడు.. కాంగ్రెస్‌లోనో.. టీడీపీలోనో చేరిపోవ‌డం, వారిని త‌న చెంత‌కు చేర్చుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌క‌పోవ‌డం వంటివి వంగ‌వీటికి తీర‌ని స‌మ‌స్య‌లుగా మారాయి. ఇప్పుడు పోయి పోయి జ‌న‌సేనలో చేరుతున్నా.. త‌న వ్య‌క్తిగత ఇమేజ్ క‌న్నా.. రంగా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే గెలిచే ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా కొంత స్వ‌యంకృతం.. మ‌రికొంత వెన్నుపోటు రాజ‌కీయాల నేప‌థ్యంలో రాధా ఉనికి ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డింద‌నే విష‌యం వాస్త‌వం! 


మరింత సమాచారం తెలుసుకోండి: