షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ప్రత్యేకహోదా అంశాన్ని వైసిపి మళ్ళీ రగిలిస్తోంది. వంచన పై గర్జన పేరుతో గురువారం ఢిల్లీలో దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకపోవటం తదితర అంశాలను అమలు చేయకపోవటంపై కేంద్రప్రభుత్వానికి నిరసనగా వైసిపి నిరసన తెలియజేస్తోంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా దీక్ష జరుగుతుంది.

 

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదా అంశం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. హోదా అంశం ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో సజీవంగా ఉందంటే అందుకు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణమని చెప్పాలి. హోదా అంశాన్ని చంద్రబాబునాయుడు ఎంతగా అణగదొక్కేయాలని ప్రయత్నించినా జగన్ ముందుండి ఆందోళనలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. నాలుగేళ్ళ పాటు చంద్రబాబు ఎన్డీఏతో అంటకాగినంత కాలం రాష్ట్రంలో ప్రత్యేకహోదా అనే డిమాండ్ వినిపించకుండా చాలా ప్రయత్నాలే చేశారు. కానీ సాధ్యం కాలేదు.

 

అదే సమయంలో జగన్ హోదా కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించారు. కళాశాలల్లో విద్యార్ధులతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ పరంగా కలెక్టర్ కార్యాలయల దగ్గర ఆందోళనలతో హోరెత్తించారు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేశారో అప్పటి నుండే హోదాపై మొదటి నుండి తానే పోరాటం చేస్తున్నంతగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. సరే ప్రత్యేకహోదాపై మొదటి నుండి ఎవరు ఏం మాట్లాడారు, పోరాటం చేసింది ఎవరు ? పిల్లిమొగ్గలేసిందెవరు ? అన్న విషయాలు జనాలకు బాగా తెలుసు. అందుకనే ఢిల్లీలో  వైసిపి భారీ నిరసన కార్యక్రమాన్ని టెకప్ చేసింది. కార్యక్రమంలో ఎంపిలు, మాజీ ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: