చంద్రబాబునాయుడుకు కెసియార్ ఇస్తానని చెప్పిన రిటర్న్ గిఫ్ట్ రెడీ అవుతున్నదా ? తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడితో కెసియార్ భేటీ సందర్భంగా అందరిలోను ఇవే అనుమానాలు ఊపందుకుంటున్నాయి. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కెసియార్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కెసియార్ మాట్లాడుతూ చంద్రబాబుకు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. తెలంగాణా ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబుకు తొందరలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే సంస్కారం లేదని అనుకుంటారంటూ చమత్కరించారు.

 Image result for cash for vote in telangana

సరే కెసియార్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ విషయంపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయనుకోండి అది వేరే సంగతి. ఇపుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పేరుతో వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న కెసియార్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. నిజానికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు మోడితో భేటీకి సంబంధాలు లేవులేండి. అయినా మోడితో భేటీ అయ్యారంటే చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ను రెడీ చేయటానికే అనే ప్రచారం పెరిగిపోతోంది. దాదాపు నాలుగేళ్ళ క్రితం ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటుకునోటు కుట్ర బయటపడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 Related image

అప్పట్లో తన ప్రభుత్వాన్ని కూల్చటానికి చంద్రబాబు కుట్ర పన్నారంటూ కెసియార్ ఓ రేంజిలో చెలరేగిపోయారు. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకునే దాకా వెళ్ళింది వ్యవహారం. చంద్రబాబుపై కెసియార్ ప్రభుత్వం కుట్ర కేసు పెట్టింది. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కెసియార్ పై టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టింది. ఆ రెండు కేసులూ హై కోర్టులో విచారణ పేరుతో కోల్డ్ స్టోరేజిలో పడున్నాయిలేండి.  పంతాలకు పోయి కంపు చేసుకోకుండా ఇద్దరు చంద్రులకు మధ్య సర్దుబాటు చేయటానికి మోడి కూడా కలగచేసుకున్నారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది.

 Related image

సరే అప్పట్లో అంటే చంద్రబాబు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు కాబట్టి మోడి కూడా కాస్త చొరవ తీసుకునే ఉండొచ్చు. కానీ ఇపుడు మోడికి చంద్రబాబుకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటున్నది వ్యవహారం.  కెసియార్, చంద్రబాబు మధ్యకూడా పరిస్ధితి డిటోనే. అందుకనే ఓటుకునోటు కేసులో ముందుకు పోవటానికి అనుమతి కోసమే కెసియార్ ప్రధానమంత్రిని కలిశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో  మొదలైంది.  ఇపుడు గనుక ఓటుకునోటు కేసు విచారణ మళ్ళీ తెరపైకి వస్తే చంద్రబాబు పరిస్ధితి ఎలాగుంటుందో ఊహించుకోవటం కూడా కష్టమే.

 Related image

సరిగ్గా ఎన్నికలకు ముందు ఓటుకునోటు కేసు విచారణ గనుక వేగం పుంజుకుంటే చంద్రబాబుకు కష్టాలు మొదలైనట్లే. ఏదో ఇప్పటి వరకూ ఏదోలా నెట్టుకొస్తున్నారు చంద్రబాబు. ఇపుడు గనుక చంద్రబాబుకు వ్యతిరేకంగా  కెసియార్, మోడి గనుక చేతులు కలిపితే చంద్రబాబు పరిస్దితి అంతే సంగతులు. ఇఫ్పటికే ఇదే కేసు విషయమై సుప్రింకోర్టులో వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటీషన్ వేశారు. ఆ కేసు ఫిబ్రవరిలో విచారణకు వస్తుందని అనుకుంటున్నారు. ఈ సమయంలో కెసియార్ కూడా కేసును స్పీడ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎవరూ ఊహించలేనంతగా మారిపోవటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: