షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా కొందరి రాజకీయ భవిష్యత్తులో గందరగోళం వీడలేదు. అటువంటి వారిలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. రాధాకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే ఒకటి కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా కొడుకు అవ్వటం. ఇక రెండో అంశం రాధా రాజకీయమంతా విజయవాడ కేంద్రంగా నడుస్తుండటమే. రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుండి కూడా విజయవాడకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి రాధా బ్యాక్ గ్రౌండ్ వల్ల ఎప్పటికప్పుడు రాధా రాజకీయం కూడా హాట్ టాపిక్ గానే ఉంటోంది. వైసిపిలో సీనియర్ నేతగా ఉన్నా నియోజకవర్గంలో వచ్చిన సమస్యల వల్ల రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది.

 

రంగా కొడుకనే కానీ తనకంటూ సొంతంగా పెద్ద ఇమేజిని సొంతం చేసుకోలేదు రాధా. రాజకీయాల్లో  రంగా తిరుగులేని నేతగా ఎదిగినా రాధా మాత్రం డక్కా మొక్కీలు తింటూనే ఉన్నారు. అందుకే మూడుసార్లు పోటీ చేస్తే రెండుసార్లు ఓడిపోయారు. అందులోను మూడుసార్లు మూడు పార్టీల నుండి పోటీ చేయటం గమనార్హం. 2004లో విజయవాడ సెంట్రల్ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసినపుడు మాత్రమే గెలిచారు. తర్వాత 2009లో పిఆర్పి తరపున పోటీ చేసి ఓడిపోయారు. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసినా గెలవలేదు. రెండుసార్లు వరుసగా ఓడిపోయారంటేనే నియోజకవర్గంలో రాధాకున్న పట్టేంటో తెలిసిపోతోంది.

 

ఇవన్నీ గమినించిన తర్వాతే రాధా నియోజకవర్గాన్ని మార్చాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. విజయవాడ తూర్పు నుండి ఎంఎల్ఏగా కానీ లేకపోతే మచిలీపట్నం నుండి ఎంపిగా కానీ పోటీ చేయమన్నారు. రాధాకేమో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వదలటం ఇష్టం లేదు. అలాగని జగన్ నిర్ణయాన్ని కాదని సెంట్రల్ నుండి పోటీ చేసేంత సీన్ రాధాకు లేదు. అదే సమయంలో టిడిపిలోకి రమ్మని కొందరు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారట. అదే విధంగా జనసేనలో చేరాలంటూ కాపు నేతలు కొందరు గట్టిగా పోరుతున్నారట. దాంతో ఏం చేయాలో రాధాకు దిక్కుతోచటం లేదు. అందుకే రాజకీయ భవిష్యత్తును కాలానికే వదిలేస్తున్నట్లు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: