ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఇటీవ‌ల కాలంలో గ‌మ్మ‌త్తుగా ఉంటోంది. రాష్ట్రంలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంద‌ని చెబుతున్నారు. దేశానికి రాష్ట్రం త‌ల‌మానిక‌మ‌ని ఉద్ఘాటిస్తున్నారు. మ‌రి పాల‌న ఇంత‌లా ప‌రుగులు పెడుతుంటే.. చంద్ర‌బాబు ఎందుకు ఆందోళ‌న చెందుతున్నారు?  రాష్ట్రంలో త‌న‌కు అధికారం మ‌ళ్లీ ద‌క్కుతుందో లేదోన‌ని ఎందుకు సంశ‌యంలో ఉన్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. తాజాగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్న రెండు ప్ర‌ధాన ప‌క్షాలు వైసీపీ, జ‌న‌సేన పార్టీల దెబ్బ‌తో చంద్ర‌బాబు ఉనికి ప్ర‌శ్నార్థ‌క మ‌వుతుంద‌నే వ్యాఖ్య‌లు ఇటీవ‌ల కాలంలో గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి.


దీంతో ఆయా వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్న చంద్ర‌బాబు.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌నుబంగాళా ఖాతంలో క‌లపాలంటూ.. ఆయ‌న పిలుపు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై విస్మ‌యం వ్య‌క్త మ‌వుతోంది. అధికారంలోకి తిరిగి రావాల‌ను కోవ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌ర‌ని, కానీ, అధికార దాహంతో వ్య‌వ‌హ‌రించ‌డం మాత్రం చాలా వ‌ర‌కు ఇబ్బంది కొనితేక త‌ప్ప‌ద‌ని అంటున్నారు. తాను అత్యంత స‌మ‌ర్ధుడిన‌ని చెప్పు కొనేట‌ప్పుడు  ఆ మాత్రం ధైర్యం లేకుండా ఇలాంటి బేల మాట‌లు అన‌నేల‌?; అని ప్ర‌శ్నిస్తున్నారు విమ‌ర్శ‌కులు., వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం, త‌న పాల‌నా ద‌క్ష‌త‌ను చూపించి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు గాను ప్ర‌య‌త్నాలు చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. 


మ‌రి దీనిని వ‌దిలేసిన చంద్ర‌బాబు గ‌ల్లీ నాయ‌కుడి మాదిరిగా ఆ రెండు పార్టీల‌ను బంగాళా ఖాతంలో క‌ల‌పాల‌ని పిలుపు నివ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు కాస్త విశాల దృక్ఫ‌థంతో ముందుకు సాగాల‌ని, ముఖ్యంగా చంద్ర‌బాబు వంటి కీల‌క నాయ‌కులు మిగిలిన నాయ‌కుల‌కు మార్గ‌ద‌ర్శ‌కులుగా ఉండాల‌ని, ఎవ‌రూ లేక‌పోతే.. నా దే అధికారం అనుకునే స్థాయిలో చంద్ర‌బాబు రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు చేస్తున్న కృషి, ప‌డుతున్న క‌ష్టం.. చూస్తున్న ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసున‌ని, వారే న్యాయ నిర్ణేత‌లుగా మారే రోజు త్వ‌ర‌లోనే రానుంద‌ని అంటున్నారు అప్ప‌టి వ‌ర‌కు బాబు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి త‌న పెద్ద‌రికాన్ని కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: