ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ సర్కారు కూడా పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. అమరావతి మాస్టర్ ప్లాన్ ను ఆ దేశమే రూపొందించి ఇచ్చింది కూడా. అందులోనూ ఉచితంగా ఆ సేవలు అందించింది. ఇప్పుడు ఆ సింగపూర్ సర్కారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు ఓ అరుదైన కానుక అందించింది.



సింగపూర్ ప్రభుత్వం అందించే ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ కు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆ పురస్కారాన్ని అందుకున్నారు. సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌ లోకేశ్‌కు ఈ ఫెలోషిప్‌ను అందజేశారు.



ఈ కార్యక్రమంలో లోకేశ్ ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న తీరు.. బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును వివరించారు. భూ రికార్డులు, రవాణా శాఖ వంటి చోట్ల బ్లాక్ చైన్‌ ఉపయోగిస్తున్న తీరును సింగపూర్ ప్రతినిధులు ఆసక్తిగా తెలుసుకున్నారు.



ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు, తమ దేశానికి మంచి మిత్రుడని సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్ అన్నారు. ఆంద్రప్రదేశ్‌తో తమ మైత్రి ఎల్లప్పుడూ కొనసాగుతుందన్నారు. తాము ఇప్పటికే అమరావతి అభివృద్ధి లో భాగస్వాములమయ్యామని... అమరావతి అభివృద్ధి కి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సింగపూర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పాలసీలను అధ్యయనం చేసి ఏపీలోని అమలు చేస్తామని నారా లోకేశ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: