జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారనే సమాచారం నెల రోజుల నుంచి వినిపిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ కూడా ఏర్పాట్లలో మునిగిపోయింది. గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దిగ్విజయం చేయాలని ప్లాన్ వేసింది. అయితే ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. ఆకస్మిక కార్యక్రమాల వల్ల వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పార్టీకి సమాచారం అందింది.

 Image result for modi ap tour

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీతో విడిపోయిన తర్వాత ఏపీలో పర్యటించబోతున్న ప్రధాని మోదీ.. ఏం చెప్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడం వల్లే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని టీడీపీ ప్రకటించింది. విభజనచట్టంలో పేర్కొన్న అంశాలను కూడా నెరవేర్చకుండా కడుపు కొట్టారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాటాలు చేస్తున్నారు. అంతేకాక.. మోదీ టూర్ కు నిరసనగా ర్యాలీలు చేపడతామని ప్రకటించారు. జనవరి 1న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాక.. మోదీ సభకు హాజరుకాకుండా నిరసన తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే మనం మోదీకి ఇచ్చే బహుమతి అన్నారు.

 Image result for modi ap tour

బీజేపీ మాత్రం మోదీ సభ ద్వారా టీడీపీ ఆరోపణలను ఎండగట్టాలని పెద్ద స్కెచ్చే వేసింది. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని విధంగా ఏపీకి సాయం చేశామని బీజేపీ చెప్తోంది. 11 జాతీయ విద్యాసంస్థలను కేటాయించామని.. మరే రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున సాయం జరగలేదని వివరించింది. అంతేకాక.. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలపడమే పెద్ద విజయమంటోంది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శిస్తోంది. కేవలం రాజకీయ కారణాలతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తుతోంది. ప్రధాని మోదీతోనే ఈ అంశాలన్నింటిపైనా క్లారిటీ ఇప్పించి ఎన్నికల ముందు కాస్తోకూస్తో బలం తెచ్చుకోవాలని ప్లాన్ వేసింది.

 Image result for ap bjp kanna

అయితే ఏపీ బీజేపీ పెట్టుకన్న ఆశలపై మోదీ నీళ్లు చల్లారు. 6వ తేదీన రావట్లేదని కబురు పంపారు. అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రాలేకపోతున్నట్టు వర్తమానం పంపించారు. జనవరి ఆఖరువారంలో.. లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఏపీకి వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో సిచ్యుయేషన్ ఏమంత అనుకూలంగా లేదని నిఘావర్గాలు హెచ్చరించడం వల్లే మోదీ పర్యటన వాయిదా వేసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: