అవును! వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ త‌థ్యం! అయితే, ఇది ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మేనా?  అదేంటి? అంటు న్నారా?  మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, మారుతున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. వంటివి అన్నీ కూడా ఇప్పుడు అనేక ప్ర‌శ్న‌లు సంధిస్తోంది. ఏపీలో ఎవ‌రు ఏవైపో.. ఎవ‌రు గ‌ట్టో తేల్చుకోలేని సందిగ్ధ‌మైన పొలిటిక‌ల్ వాతవ‌ర‌ణం క‌నిపిస్తోంది. దీంతో ప‌వ‌న్  ఎటు ప‌య‌నిస్తున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. నిజానికి ఆయ‌న సొంత‌గా ఎదిగి.. త‌న సొంత కాళ్ల‌పై సీఎం కావాల‌ని అనుకుంటే.. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేయాల‌ని అనుకుంటే.. ఇప్పుడు ఉన్న స్త‌బ్ద‌త వాతావ‌ర‌ణం మాత్రం ఉండ‌దు. జ‌న‌సేన‌లో మంచి జోరు క‌నిపించేది. అయితే, అది క‌నిపించ‌డం లేద‌ని అంటే.. తెర వెనుక ఏదో మంత్రాంగం జ‌రుగుతోంది. 


ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ప‌వ‌న్ కేవ‌లం 7 జిల్లాల్లోనే త‌న ప్ర‌భావం చూపిస్తున్నారు. అక్క‌డ మాత్ర‌మే ఆయ‌న ప్ర‌చారం, పోరు య‌త్ర ఏదైనా చేస్తున్నారు. మ‌రి మిగిలిన జిల్లాల సంగ‌తి ఏంటి?  నేరుగా సీఎం కావాల‌ని కోరిక ఉన్న నాయ‌కుడు మిగిలిన జిల్లాల‌తో సంబందం లేకుండానే సీఎం పీఠం ఎక్కే ఛాన్స్ ద‌క్కుతుంద‌ని ఎవ‌రైనా ఊహించే ప‌రిస్తితి ఉందా?  పోనీ.. తీరిగ్గా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక చూసుకుందాం అనుకున్నా.. రాష్ట్రంలో అలాంటి ప‌రిస్థితి లేదుక‌దా?!  ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఏడాది కిందటే త‌న ప్రజాసంక‌ల్ప యాత్ర ద్వారా ప్ర‌చారం ప్రారంభించేశారు., మ‌రి చంద్ర‌బాబు కూడా జోరుగా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ.. ఏదో ఒక రూపంలో ప్ర‌చారం ఉద్రుతం చేస్తున్నారు. 


రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితి ఉన్న నేప‌థ్యంలో కేవ‌లం ప‌వ‌న్ ఎంచుకున్న జిల్లాల‌ను ప‌రిశీలిస్తే.. కేవ‌లం అధికార టీడీపీని దెబ్బ‌కొట్టే క్ర‌తువులో భాగంగానే ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నాడ‌నేది వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, ఇది ఎవ‌రికి లాభం?  అనేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎక్క‌డెక్క‌డ టీడీపీకి బ‌లం ఉందో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ త‌న సామాజిక వ‌ర్గం ప్ర‌భావ‌మో.. సినీ హీరోయిజ‌మో చూపించి గెలుచుకుంటే.. ఆటోమేటిక్‌గా అక్క‌డ టీడీపీ బ‌ల‌హీన ప‌డ‌డం ఖాయం. ఇక‌, వైసీపీకి బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు మ‌రింత బ‌ల‌ప‌డే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ వెనుక బీజేపీ లేదా మ‌రో శ‌క్తి ఏదైనా ఉంద‌నే ప్ర‌చారం మాత్రం జ‌రుగుతోంది.

దీనికి తోడు ఇప్పుడు జ‌న‌సేన‌లో నే జ‌రుగుతున్న మ‌రో ప్ర‌చారం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం 40 స్థానాల్లోనే జ‌న‌సేన పోటీ చేసి ఓ పాతిక స్థానాల్లో విజ‌యం సాధించి అధికార ప‌క్షం నిర్ణాయ‌క శ‌క్తిగా ఎద‌గాల‌నే ల‌క్ష్యంతోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. పార్టీగా జ‌న‌సేన‌కే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి. కొన్ని జిల్లాల‌ను ఆయ‌న ట‌చ్ చేయ‌ని ప‌రిస్థితిలో ఎలా ముందుకు వెళ్తారో.. ఉన్న రెండు మాసాల కాలాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: