రాజశ్యామల యాగం నిర్వహించి ముఖ్యమంత్రి అయిన కెసియార్ త్వరలో మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగాన్ని నిర్వహించటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పైకి రాష్ట్రాభివృద్ధి, లోకకల్యాణమని చెబుతున్నా నిజానికి కెసియార్ తదుపరి లక్ష్యం మాత్రం వేరే ఉందని అందరికీ తెలుసు. రెండోసారి ముఖ్యమంత్రి కాగానే కెసియార్ తన తదుపరి రాజకీయ లక్ష్యానికి ఢిల్లీనే కేంద్రస్దానంగా చేసుకున్నారు. అంటే అవకాశాలు కలసివస్తే ప్రధానమంత్రి పీఠంపైనే గురిపెట్టినట్లు అర్ధమైపోతోంది. వాస్తు, జాతకాలు, దిన వార ఫలాలపై బాగా గురుండే కెసియార్ తరచూ ఏదో ఒక యాగాన్ని చేస్తూనే ఉంటారు. ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేసిన కెసియార్ తాజాగా మహారుద్ర సహిత చండీయాగాన్ని నాలుగురోజుల పాటు చేయబోతున్నారు. జనవరి 21వ తేదీ నుండి యాగాన్ని నాలుగు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకూ చేస్తున్నారు.

 

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యాగం చేయటానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. శృంగేరి జగద్గురు స్వామి భారతీ తీర్ధస్వామి ఆశీస్సులతో శృంగేరి శారధాపీఠం పద్దతిలోనే మహాయాగం జరిపేందుకు కెసియర్ ఏర్పాట్లు చేస్తున్నారు.  చవుర్వేద పండితుడు, జ్యోతిరాప్తోర్యామయాజి మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మ, ఫణిశశాంక శర్మ తదితనేల ఆధ్వర్యంలో జరిగే మహాక్రతువులో 200 మంది రుత్విక్కులు పాల్గొంటున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాగ నిర్వహణకు సంబంధించి సిఎం కెసియార్ మాణిక్య సోమయాజితో ఏర్పాట్లపై చర్చలు జరిపారు.

 

 

సహస్ర చండీయాగంలో తొలిరోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడోరోజు 300, నాలుగోరోజు 400 పారాయణాలు చేస్తారు. అన్నీ కలిపితే వెయ్యి పారాయణాలవుతాయి. ఐదో రోజు 11 యజ్ఞకుండాల వద్ద ఒక్కో యజ్ఞకుండం వద్ద 11 రుత్విక్కులతో 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. పూర్ణాహుతితో యాగం సమాప్తమవుతుంది. యాటం నిర్వఘ్నంగా సాగటానికి పరిసమాప్తమవ్వటానికి కెసియార్ వివిధ ప్రాంతాల్లోని స్వామీజీలను, ధార్మికవేత్తలను, వేదపండితులను సంప్రదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: