దేశంలో నాన్ కాంగ్రెస్.. నాన్ బీజేపీ ఫ్రంట్ కు రంగం సిధ్ధమవుతోంది. ఈ విషయంలో దూకుడు మీద ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట రాష్ట్రాలన్నీ కలియతిరుగుతున్నారు. ఎక్కడికక్కడ ఫ్రంట్ లోకి వివిధ పార్టీలను ఆహ్వానించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.  రేపటి రోజున దేశంలో ఫ్రంట్ ప్రయోగం సక్సెస్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు.


ఏపీలో జగన్ :


ఇక కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ లో ఏ రాజకీయ పార్టీలు ఉంటాయన్నది ఒక విషయమైతే ఏపీలో ఎవరు దోస్తీ కడతారు అన్నది మరో ఆసక్తికరమైన పరిణామం. దీనిమీద కేసీయార్ మీడియా మీట్లో డౌట్లు తీర్చేశారు. ఏపీలో చంద్రబాబు ఫ్రంట్ లోకి వస్తారా అని విలేకరులు అడిగిన దానికి బదులుగా అక్కడ ఆయన ఒక్క పార్టీయే ఉందా అంటూ కేసీయార్ ప్రశ్నించడం  ఇక్కడ గమనార్హం. అంతే కాదు. అక్కడ వైసీపీ జగన్, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా అని కేసీయార్ చెప్పడంతో ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ ఉంటారన్నది క్లారిటీ వచ్చింది.


మారనున్న రాజకీయం :


అదె జరిగితే ఏపీ రాజకీయాలు సమూలంగా మారతాయన్నది వాస్తవం. కేసీయార్ లాంటి వ్యూహకర్త వైసీపీకి మద్దతుగా వస్తే ఏపీలో బాబుని ఢీ కొట్టడం సులువు అవుతుంది. సరైన వ్యూహాలు లేకనే 2014లో ఏపీలో వైసీపీ చతికిలపడిన సంగతి విధితమే. ఇక కేసీయార్తో జగన్ దోస్తీని బాబు అపుడే అడ్డుకునేలా విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడిన కేసీయార్ తో జగన్ ఎలా స్నేహం చేస్తారని నిలదీస్తున్నారు. దానికి బదులు అన్నట్లుగా కేసీయార్ తాను ఏపీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని కచ్చితంగా చెప్పేశారు.


అవసరమైతే ప్రధానికి లేఖ కూడా రాస్తానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో కేసీయార్ కి మరింత ఆదరణ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. హోదా మీద ఏపీలో  రేపటి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేసీయార్ తో వైసీపీ దోస్తీని కూడా బాబు ఇపుడు ఏ విధంగానూ విమర్శించలేరు. దాంతో ఏపీలో ఫెడరల్ ఫ్రంట్ గట్టిగానే పునాదులు వేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: