చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు రోజుకో ర‌కంగా ఉంటున్నాయి. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కులే బ‌హిరంగంగా చెబుతున్నారు. ఇటు రాజ‌కీయాలు, అటు పాల‌నల‌ను స‌మ‌తుల్యం చేయ‌డంలో ఆయ‌న చేస్తున్న ఆలోచ‌న‌లు కొన్ని సార్లు విక‌టిస్తున్నా యి. తాజాగా ఇలాంటి ఆలోచ‌నే చేసి నెటిజ‌న్ల దృష్టిలో చుల‌క‌న‌య్యార‌నే వ్యాఖ్య‌లువినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏం జ‌రిగినా.. చంద్ర‌బాబు రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు ఉన్న అన్ని మార్గాల‌నూ ఆయ‌న వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా రాష్ట్రానికి హైకోర్టు రావ‌డంపైనా ఆయ‌న త‌న‌దైన శైలిలో రాజ‌కీయంగా మార్చుకున్నారు. 


లేని విష‌యాన్ని హైకోర్టుతో ముడిపెట్టి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నారు. హైకోర్టు విభజన పరిణామాల వల్ల వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై నడుస్తున్న కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘జగన్‌ కేసుల్లో వాదనలు దాదాపుగా పూర్తయ్యాయి. సవ్యమైన ముగింపు దశకు వచ్చాయి. ఈ దశలో కోర్టుల విభజన పేరుతో మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. హైకోర్టుతో పాటు సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు’ అని సీఎం అన్నారు. ఈ లాభం కోసమే కేంద్రం మన రాష్ట్రంపై ఎంత వివక్ష చూపిస్తున్నా జగన్‌ నోరు తెరవడం లేదని విమర్శించారు. వాస్త‌వానికి కోర్టుల విభ‌జ‌న జ‌రిగినంత మాత్రానో.. న్యాయ‌మూర్తి మారినంత మాత్రానో.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఏ కేసు విచార‌ణ‌నైనా మొద‌టి వ‌స్తుందా?  


గ‌తంలో వివిధ రాష్ట్రాలు రెండు విడిపోయిన సంద‌ర్భాలు దేశంలో అనేకం ఉన్నాయి. అక్క‌డ కూడా కోర్టుల విభ‌జ‌న జ‌రిగింది. మ‌రి అక్క‌డ కూడా జార్ఖండ్ మాజీ సీఎం మ‌దుకోడా, బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ వంటి వారిపై సీబీఐ కేసులు న‌మోదు చేసింది. అవి ఎక్క‌డా మొద‌టి వ‌చ్చిన సంద‌ర్భాలు లేవు. కానీ, ఇక్క‌డ మాత్రం చంద్ర‌బాబు భ‌య‌ప‌డిపోతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు భావించిన విష‌యం ఈ సంద‌ర్భంగా మ‌రోసారి తెర‌మీదికి వ‌స్తోంది. అసలు ఈవిష‌యంలోనే మోడీకి, జ‌గ‌న్‌కు చెడింద‌నే ప్ర‌చారం కూడా వ‌స్తోంది. 


ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏదో ఒక కార‌ణం చూపించి జ‌గ‌న్‌ను బ‌య‌ట లేకుండా చేస్తే.. తాను సుల‌భంగా ఎన్నిక‌ల్లో నెగ్గాల‌నే ప్లాన్‌లో చంద్ర‌బాబు ఉన్నారా? అనే ఆలోచ‌న‌ల‌కు ఇప్పుడు ఆయ‌న చేస్తున్న కామెంట్లు బ‌లాన్నిస్తున్నాయి. అయితే, గ‌తంలో ఎక్క‌డా కూడా కోర్టులు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత కూడా ఆయా కేసుల విచార‌ణ య‌థాత‌థంగా జ‌రిగిందే త‌ప్ప‌.. బాబు ప్ర‌వ‌చించిన‌ట్టు మ‌ళ్లీ మొద‌టికి అనే సూత్రం ఎక్క‌డా పాటించ‌లేదు. ఏదో ఒక విష‌యాన్ని మోడీకి, జ‌గ‌న్‌కు లింకు పెట్టి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగానే చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. టెక్నిక‌ల్‌గా చూసినా.. ఇది నిజ‌మే క‌దా అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: