ఏపీలో ఇటీవ‌ల కాలంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన త్రిముఖ పోటీ విష‌యం ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మ‌రుగు కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ త‌న పార్టీ జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల‌లోకి తీసుకు వెళ్లింది కానీ, త‌న పార్టీకి ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన గ్లాసు గుర్తును ప్ర‌చారం చేసింది కానీ క‌నిపించ‌డం లేదు. పోనీ.. ప‌వ‌న్ వ్యూహం ప్ర‌కారం జ‌న‌వ‌రి రెండు త‌ర్వాత విస్తృతంగా ప‌ర్య‌టించినా.. న‌గ‌రాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కే ఆయ‌న ప‌రిమితం అవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో గ్రామ స్థాయిలో ప్ర‌చారం కానీ.. గ్రామీణుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప‌వ‌న్ చేయ‌గ‌లిగే ప్ర‌చారం ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. దీంతో న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌ల‌తోనే ప‌వ‌న్ స‌రిపెట్ట‌నున్నారు. ఒక్కొక్క జిల్లాలో చూసుకున్నా క‌నీసం రెండు నుంచి మూడు న‌గ‌రాలు ఉన్నాయి. 


వీటిలో ప్ర‌చారం చేయాలి. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్రచారం చేయాలి. వీట‌న్నింటి సుడిగాలి ప‌ర్య‌ట‌న చేద్దామ‌న్నా కూడా జ‌న‌సేనానికి స‌మ‌యం స‌రిపోయేలా లేదు అంటున్నారు విశ్లేష‌కులు. పోనీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏమైనా జ‌రిగిందా? త‌న‌కు అనుకూలంగా ఓ వెయ్యి మందిని ప‌వ‌న్ త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారా? ఏ ఎన్నిక‌ల్లో అయినా పార్టిసిపేట్ చేశారా?  అంటే.. వ‌చ్చిన అవ‌కాశం నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను వ‌దులు కున్నారు. ఇక‌, తెలంగాణాలో స‌త్తా చాటుతాన‌ని ఆది నుంచి చెప్పి.. యూత్‌లో కోరిక రేపిన ప‌వ‌న్ చివ‌రి నిముషానికి త‌న కు స‌త్తా లేద‌ని చేతులు ఎత్తేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఏ ఒక్క ఎన్నిక‌లోనూ పాల్గొన‌లేదు. 


ఈ క్ర‌మంలోనే తాజాగా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఏపీలో ప‌వ‌న్ అనుస‌రించే వ్యూహంపై అంద‌రి దృష్టీ ప‌డింది. ఆయ‌న ఎవ‌రిని ఎలా ఎదుర్కొంటారు? ఏ యే నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తారు? ఎవ‌రిని ఎంచుకుంటారు? అనేచ‌ర్చ సాగుతోంది. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షాలుగా టీడీపీ, వైసీపీలు ఉన్న స‌మ‌యంలో మ‌రింత బ‌లంగా దూసుకు పోవాల్సిన ప‌వ‌న్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మౌనం వ‌హించ‌డం వెనుక పూర్తిగా ఆయ‌న ఈ రెండు పార్టీల వ్య‌తిరేక ఓటు బ్యాంకును న‌మ్ముకున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇది నిజ‌మే అయితే, ప‌వ‌న్ మూడో స్థానానికి కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా పోతుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే.. ప‌వ‌న్‌కు ప‌డుతుంద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. హ‌డావుడిగా ఎవ‌రికి ప‌డితే వారికి టికెట్ ఇచ్చి పోటీ చేశాం అంటే పోటీ చేశామ‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే.. మొద‌టికే మోసం తెచ్చుకున్న‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: