అవును! ఇప్పుడు ఏపీలోను , తెలంగాణాలోనూ ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. ఒక్క‌సారిగా తెలంగాణా సీఎం కేసీఆర్ త‌న రేటింగ్‌ను తానే పెంచేసుకున్నారు. ఏపీలో రాజ‌కీయాల్లో వేలు పెడ‌తాన‌ని ఇటీవ‌ల తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల అనంతరం.. ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌కు సంబంధం లేని త‌మ‌ను విమ‌ర్శించాడ‌ని, త‌మ రాష్ట్రంలో ఎన్నిక‌ల్లో వేలు పెట్టాడ‌ని, తాము ఊరుకుంటామా? అని అప్ప‌ట్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, దీనిని అప్ప‌ట్లో టీడీపీ సీరియ‌స్‌గా తీసుకున్నా.. మిగిలిన పార్టీలు ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. నిజానికి ఇది ప్ర‌జాస్వామ్య దేశం కావ‌డంతో ఎవ‌రు ఎక్క‌డి వెళ్ల‌యినా.. రాజ‌కీయాలు చేసుకోవ‌చ్చు. 


ఈ క్ర‌మంలోనే కేసీఆర్ అలా వ్యాఖ్యానించి ఉంటార‌ని అప్ప‌ట్లో అనుకున్నారు. కానీ, తాజాగా కూడా కేసీఆర్ మ‌రోసారి చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. తాము చెప్పింది చేస్తామ‌ని కేసీఆర్ అన్నారు. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని, అది అలా ఇలా ఉండ‌ద‌ని అన‌డం సంచ‌ల‌నానికి దారితీసింది. దీనిపై అనేక వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. కేసీఆర్ ముందు రెండు రూపాల్లో బాబుపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు అవ‌కాశం ఉంది. వీటిలో ఒక‌టి.. స్వ‌యంగా నేరుగా ఏపీలోకి వ‌చ్చి బాబుకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డం. అయితే, ఇలా చేయ‌డం వ‌ల్ల కేసీఆర్ ఎవ‌రో ఒక‌రికి ఖ‌చ్చితంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. 


దీంతో ఈ ప‌రిణామాన్ని మ‌ళ్లీ చంద్ర‌బాబు త‌న‌కు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశం ఉంటుంది. ఇదే జ‌రిగితే.. కేసీఆర్ వ్యూహం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీంతో ఇక్క‌డ త‌న‌కు అనుకూలంగా ఉన్న పార్టీ లేదా, నాయ‌కుడికి కేసీఆర్ ప‌రోక్షంగా సాయం చేయ‌డం. అది ఆర్థికంగానే అయ్యే అవ‌కాశం ఉంటుంది. అదేస‌మ‌యంలో ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్ద‌రు కీలక నేత‌ల‌ను కూడా ఆయ‌న ఒక్క‌టి చేసి .. చంద్ర‌బాబుపై యుద్ధానికి సంక‌ల్పించే అవ‌కాశం ఉంటుంది. వీట‌న్నింటినీ ప‌క్క‌న పెడితే.. ఏపీ బోర్డ‌ర్‌లోని జిల్లాల్లో టీఆర్ ఎస్ నేరుగా పోటీకి కూడా దిగే సాహ‌సం  చేయొచ్చు. 


ఇలా ఏ రూపంలో కేసీఆర్ చేయాల‌ని అనుకున్నా.. ఇంత‌కు మించిన ప‌రిస్థితి లేదు. దీని నుంచి చంద్ర‌బాబు త‌న‌ను తాను ర‌క్షించుకుంటూనే పార్టీని గెలిపించుకుంటాడా?  లేక కేసీఆర్ ఇచ్చే గిఫ్ట్ తీసుకుని మౌనంగా ఉంటారా?  అనేది తేల‌డం కోసం కొద్దిగా స‌మ‌యం ప‌ట్ట‌డం ఖాయ‌మని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా తాజా కేసీఆర్ వ్యాఖ్య‌లు రేటింగ్‌ను అమాంతం పెంచేశాయ‌న‌డంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: