తెలంగాణాలో తెలుగుదేశంపార్టీతో పొత్తులు పెట్టుకుని నెత్తిన గుడ్డేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపిలో కూడా పొత్తుకు తహతహ లాడుతోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి లాంటివారు. రానున్న ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవటం వల్ల ఏదో సాధించేద్దామని కోట్ల అనుకుంటున్నట్లున్నారు. మామూలుగా అయితే కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు వచ్చే ఓట్లేమీ ఉండవు. అదే టిడిపితో పొత్తులు పెట్టుకుంటే కొన్ని ఓట్లైనా వస్తాయని అదృష్టం కలసివస్తే ఏకంగా ఎంపి అయిపోవచ్చని కోట్ల ఆశపడుతున్నట్లున్నారు. అందుకనే వచ్చే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పొత్తుంటుందని చెబుతున్నారు.

 

పోయిన ఎన్నికల్లో కర్నూలు ఎంపిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోట్లకు సుమారు లక్ష ఓట్లొచ్చాయి. అయితే, ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తే అంతకన్నా ఎక్కువ వస్తాయన్న నమ్మకం లేదు. పైగా ఆర్దికంగా పార్టీ అభ్యర్ధులు చాలా ఇబ్బందులు పడాల్సుంటుంది. ఖర్చుల విషయంలో టిడిపి, వైసిపి అభ్యర్ధులతో పోటీ పడి చేయాల్సుంటుంది. అంత ఖర్చు చేసినా మరి ఫలితం మాటేంటి ? ఎంత తక్కువేసుకున్నా ఎంపిగా జనరల్ సీట్లలో కనీసం రూ 100 కోట్లు ఖర్చవుతుందనటంలో సందేహం లేదు. కాంగ్రెస్ అభ్యర్ధి కాబట్టి తక్కువలో తక్కువ అందులో సగం ఖర్చన్నా చేయల్సిందే. లేకపోతే డిపాజిట్లు కూడా రావు.

 

అందుకనే ఈ విషయాలన్నింటినీ ఆలోచించిన కాంగ్రెస్ సీనియర్ నేత టిడిపితో పొత్తుకు తహతహలాడుతున్నారు. టిడిపితో పొత్తుంటే నిర్దిష్టంగా కొన్ని ఓట్లు, ఖర్చుకు డబ్బు సమకూర్చటం చంద్రబాబు బాధ్యతగా చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకంటూ ఇంకా కొంత ఓటు బ్యాంకుంది. దాన్ని పూర్తిగా రాబట్టుకుంటే చాలు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీ ఓట్లను కూడా రాబట్టుకుంటే చాలని కోట్ల భావిస్తున్నాట్లున్నారు. ఇలా ఆలోచించే తెలంగాణాలో పొత్తులు పెట్టుకుని కాంగ్రెస్, టిడిపిలో బోర్లా పడ్డాయి. మళ్ళీ అదే పరిస్ధితి ఏపిలో కూడా పునరావృతం కాదని గ్యారెంటీ ఏమీ లేదు. మొత్తానికి తెలంగాణా అనుభవంతో పొత్తులపై రెండు పార్టీల నేతల్లోను అంతర్మధనం మొదలైనట్లు సమాచారం. మరి ఏపిలో కూడా పొత్తులు ఖరారైతే ఓటర్లు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: