ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయ‌న ప్ర‌శ్నించ‌డం మాట అటుంచితే. ఆయ‌న‌కే ప్ర‌శ్న‌లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అనేక విష‌యాల‌పై ఆయ‌న క్లారిటీ లేకుండా రాజ‌కీయాల్లోకి రావ‌డమే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. ఏ విష‌యంపైనా ప‌వ‌న్‌కు క్లారిటీ లేద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు, వేస్తున్న అడుగులు చూస్తున్న‌, వింటున్న మేధావులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. త‌న‌కు సీఎం సీటు అక్క‌ర‌లేద‌ని, దీనికి అనుభ‌వం కావాల‌ని గ‌తంలో చెప్పిన ప‌వ‌న్‌.. త‌ర్వాత మాత్రం తానే సీఎం ఎందుకు కాకూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై స‌టైర్ల కూడా పేలాయి. ఇక‌, ఏపీ, తెలంగాణాల్లో తాను చ‌క్రం తిప్పుతాన‌ని, ప్ర‌ధాన పోటీ ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. 


దీంతో ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ ఎన్నికల్లో క‌నీసం ఒక్క‌రంటే ఒక్క అభ్య‌ర్థిని కూడా నిలబెట్ట‌లేదు. ఇక‌, ఏపీలో తాను ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతాన‌ని అన్నారు ప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకు రిటైర్మెంట్ ఇద్దాం.. జ‌గ‌న్‌ను ఇంటికి పంపిద్దాం అంటూ కామెంట్లు కుమ్మ‌రించారు. అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. కొంద‌రు ప‌వ‌న్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. ఇంకేముంది ప‌వ‌న్ సీఎం అయిపోతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగిపోయింది. అయితే, ఏపీలో 2017లో జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న దూరంగానే ఉన్నారు. ఒక‌టి నంద్యాల ఉప ఎన్నిక‌, రెండు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌. ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ పాల్గొనే ప్ర‌చారం చేయ‌లేదు. 


పైగా ఇవి కాదు.. అస‌లు సిస‌లు ఎన్నిక‌ల్లోనే త‌న స‌త్తా చూపిస్తాన‌ని చెప్పారు. పోనీ .. అదైనా చేస్తున్నారా? అంటే.. సందేహాలే రాజ్య‌మేలుతున్నాయి. పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌లకు మ‌రెంతో దూరం లేదు. మ‌రో రెండు నెల‌ల్లో ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ నిర్మాణం కూడా ఇంకా ప్రాథ‌మిక స్థాయిలో ఉంది. ఇదే స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర‌తోపాటు, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌పైనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ‌గా దృష్టి కేంద్రీక‌రిస్తున్నారు. ఇంకా రాయ‌ల‌సీమ‌లో పార్టీకి పునాదులు కూడా ప‌డ‌లేదు. మ‌రి సీఎం సీటును ఆశిస్తున్న నాయ‌కుడు ఇలా జిల్లాల‌కు జిల్లాల‌నే ఇప్ప‌టి వ‌ర‌కు ట‌చ్ కూడా చేయ‌డం లేదంటే.. ఆయ‌నకుఎలాంటి వ్యూహం ఉంద‌ని అనుకోవాలి? 


2019 ఎన్నిక‌ల్లో అటు తెలంగాణ‌లో, ఇటు ఏపీలోని అన్నిసీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని గ‌తంలో ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. కానీ.. మొన్న తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌లేదు. ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ ఇంకా నిల‌దొక్కుకోలేదు. ఇదే స‌మ‌యంలో గ‌త ఏడాది కాలంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌డుతున్న పాద‌యాత్ర ఆ పార్టీకి మంచి బూస్ట్ ఇస్తోంది. మ‌రోప‌క్క‌, చంద్ర‌బాబు పార్టీ టీడీపీ కూడా అభివృద్ది జ‌పం చేస్తూ.. ప్ర‌చారంలో మునిగితేలుతోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ ఊసులేకుండా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం అనేక సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఏపీలోనూ పోటీ కి దూరంగానే ఉంటారా?  లేక ఏదో ఓ పాతికో ముప్పై సీట్ల‌లో పోటీ చేసిన ఆ నాలుగో ఐదు చోట్లో గెలిచి.. చ‌క్రం తిప్పాల‌ని అనుకుంటున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ప‌వ‌న్ వ్యూహం ఏంటో తెలియాలంటే ఖ‌చ్చితంగా వెయిట్ చేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: