ఏపీలో ఎన్నికలు దగ్గరపడ్డాయి. కొత్త ఏడాది కూడా వచ్చేసింది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయమైన‌నేపధ్యంలో న్యూ యియర్ తొలి రోజునే ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం తన వారెవవో పర వారెవరో చూసుకున్న చంద్రబాబు చీకట్లో బాణం వేశారా, లేక బాబు వదిలిన బాణమేనా అన్న దానిపై సందేహాలెన్నో పుట్టుకువస్తున్నాయి. 


పవన్ పై సాఫ్ట్ కార్నర్ :


న్యూ యియర్ తొలి రోజు మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జనసేనాని విషయంలో ఆసక్తికరంగా స్పందించారు. ఈ మధ్యన టీడీపీ పవన్ పై విమర్శలు చేయడంలేదెందుకు అని మీడియా అడిగిన ప్రశ్నకు బాబు నవ్వే సమాధానమైంది. ఇక 2014లో పవన్ జనసేనతో కలసి పోటీ చేశారు. మళ్ళీ 2019లో ఈ కాంబోను చూడొచ్చా అని అడిగిన ప్రశ్నకు బాబు సమాధానం నవ్వే అయింది. రెట్టించి అడిగినా ఊహాజనిత ప్రశ్నలకు జవాబు చెప్పనన్నారే తప్ప పవన్ తో పొత్తును బాబు తిరస్కరించకపోవడం ఇక్కడ విశేషం. 
ఇక పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తూంటే  జగన్ కి భయం ఎందుకు అని బాబు ఆయనకు మద్దతుగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించే వ్యవహారమే. మొత్తం మీద చూసుకుంటే బాబు పవన్ ల మధ్యన ఏదో తెలియని బంధం ఉందా అన్న అనుమానాలు కలిగించేలా బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.


లాభం ఎవరికి :


పవన్ తమతోనే ఉన్నారు, లేకపోతే రేపటి రోజున ఉండబోతారు అని బాబు ఇస్తున్న ఈ కలరింగ్ జనసేనకు ఎంతవరకు లాభం చేకూరుస్తుందన్న  దానిపై ఇపుడు చర్చ సాగుతోంది. గత ఏడాదిగా బాబును విభేదించి వస్తున్న పవన్ ఎన్నికల ముందు బాబుతో పొత్తు పెట్టుకుంటే జనం మాట పక్కన పెడితే పార్టీలోని వారైన హర్షిస్తారా అన్నది డౌటే. ఇక పవన్ బాబు మళ్ళీ దోస్తీ చేసినా ఈసారి గోదావరి జిల్లాలతో పాటు మిగిలిన జనం నమ్ముతారా అనంది పెద్ద ప్రశ్న.
నిజానికి పవన్ మనసులో ఏముందో కానీ బాబు మాత్రం అనుమానాలు కలిగేలా మాట్లాడడం ద్వారా ఏ రకమైన సంకేతాలు ఇవ్వదలిచారు అన్నది ఇక్కడ ఆలోచిందాలి. రాజకీయ చాణక్యుడు అయిన బాబు చీకట్లో తెలివిగా వేసిన బాణమా లేక నిజంగానే ఒక అవగాహన తెర వెనక జరిగిందా అన్న ప్రశ్నలు కూడా ఇపుడు  ఉదయిస్తున్నాయి. ఏది ఏమైనాబాబు నవ్వు ఇపుడు జనసేనకు ఇబ్బందికరంగానే మారనుంది.


జగన్ కి  ప్లస్సా :


పవన్ బాబు ఒక్కటే అంటూ చాలాకాలంగా ప్రచారం చేస్తూ వస్తున్న వైసీపీకి బాబు నవ్వు రూపంలో పెద్ద ఆయుధమే దొరికింది. బాబు నర్మగర్భంగా దీనిపై ఏదీ చెప్పకుండా ఉన్నా  చేరాల్సిన సంకేతాలు, సందేశాలు  ఈ సరికే చేరిపోయాయి. ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు కనుక నిజం అయితే మాత్రం అది కచ్చితంగా వైసీపీకి మేలు చేసేదే అవుతుందని, ఆ రెండు పార్టీల పొత్తుకు 2014 జై కొట్టిన ఓటర్లు 2019లో మాత్రం నమ్మరని, పైగా ఇన్నాళ్ళు జనసేనకు కొన్ని బాబు వ్యతిరేక ఓట్లు పోతాయని కంగారు పడిన వైసీపీ ఇంక గుండె మీద చేయి వేసుకుని పడుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి న్యూ యియర్ వస్తూనే బాబు కొత్త ట్విస్ట్ ఇచ్చారని అంటున్నారు. చూడాలి ఈ పరిణామాలు ఎలా ఉంటాయో, జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: