ఎన్నికల ప్రచారం ఎప్పటికపుడు మారుతోంది. క్యాచీగా ఉండే మాటలను ఉపయోగిస్తూ జనాలను ఆకట్టుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో అవి విజయవంతం అవుతున్నాయి కూడా. గతంలో బ్రింగ్ బాక్ బాబు, బాబు రావాలి జాబు రావాలి  ఇలాంటి నినాదాలతో టీడీపీ దూసుకుపోయింది. విజయం సాధించి అధికారం  కూడా చేపట్టింది. ఇపుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి


నిన్ను నమ్మం బాబూ :


ఇది ఇపుడు వైసీపీ నినాదంగా ఉంది. బాబును నమ్మొద్దంటూ ఓ వైపు వైసీపీ అధినేత జగన్, ఇతర నాయకులు మీటింగుల్లో ప్రచారం చేస్తున్న సంగతి విధితమే దాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి క్షేత్ర స్థాయిలో ప్రణాళికాబద్దంగా గట్టి ప్రచారం చేయాలని వైసీపీ వ్యూహం రూపొందించింది .  ఇందులో భాగంగా ‘నిన్ను నమ్మం బాబూ..’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఈ యాత్రకు సంఘీభావంగా ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకూ చేపట్టాల్సిన ముందస్తు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ అన్ని నియోజకవర్గాలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.


హోర్డింగులతో భారీ  ప్రచారం :


వైసీపీ ఆదేశాల మేరకు ‘నిన్ను నమ్మం బాబూ...’ అనే పెద్ద హోర్డింగ్‌ను తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.  - సమన్వయకర్తలు గ్రామాల్లో పర్యటించే సమయంలో పార్టీ పంపిన స్టిక్కర్లను అతికించిన వాహనాలనే ఉపయోగించాలి.  కనీసం 500 మంది గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిచి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. హాజరైన వారితో ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమానికి మద్దతుగా 9121091210 నంబరుకు మిస్డ్‌ కాల్స్‌ ఇప్పించాలి. గ్రామాల్లో సమావేశాల తర్వాత ర్యాలీలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి.  - జనవరి 9న ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ, ర్యాలీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమన్వయకర్తలు పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి, సభను విజయవంతం చేయాలి. ఇలాంటి ఉద్యమ కార్యాచరణతో వైసీపీ ఇపుడు తనదైల శైలిలో జనంలోకి దూసుకుపోవాలనుకుంటోంది.


కౌంటరేనా :


కాగా, టీడీపీ జన్మభూమి కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలను అందిన వారిని గుర్తించి వారి ఇంటి మీద పార్టీ స్టిక్కర్లు అతికించడం మళ్ళీ బాబు రావాలన్న నినాదాలతో కార్యక్రమాలు చేపట్టడం వంటివి ఉన్నాయి. వాటిని అడ్డుకోవడానికే వైసీపీ నిన్ను నమ్మం బాబూ అన్న ప్రోగ్రాం చేపట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జనం ఎవరిని నమ్ముతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: