ప్ర‌త్య‌ర్థిని ఎంత బ‌ల‌హీన ప‌రిస్తే.. మ‌నం అంత బ‌ల‌వంతులం అవుతామ‌నే సూత్రం ఒక‌టి ఉంటుంది. ఇది రాజ‌కీయాల్లో కీల‌క సూత్రం ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రో మూడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న ఎత్తులు ఒక్కొక్క‌టిగా తెర‌మీదికి తెస్తున్నారు. రాష్ట్రంలో త‌న‌కు, చంద్ర‌బాబుకు పోటీ ఉంటుంద‌ని ఆయ‌న ఆది నుంచి న‌మ్ముతున్నారు. దీనిని ఆయ‌న ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం ద్వారా అధికారానికి ద‌గ్గ‌ర కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లైంది. అంతేకాదు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన తమ‌కు ఎన్న‌టికీ పోటీ కాద‌ని, కాలేద‌ని జ‌గ‌న్ న‌మ్ముతూ వ‌చ్చారు. 


అంతేకాదు, ప‌వ‌న్ విజృంభించినా సీఎం సీటుపై క‌న్నేయ‌ర‌ని అనుకున్నాడు జ‌గ‌న్‌. కానీ, రాజ‌మండ్రి వార‌ధిపై నిర్వ‌హిం చిన భారీ క‌వాతు సంద‌ర్భంగా ప‌వ‌న్ త‌న మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట పెట్టాడు. సీఎం అయితే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించాడు. దీంతో జ‌గ‌న్ గుండెల్లో రాయి ప‌డిన‌ట్టు అయింది. త‌ను క‌లలు కంటున్న సీఎం సీటుకు ప‌వ‌న్ కూడా పోటీ వ‌స్తుండ‌డంతో జ‌గ‌న్ ఒక్క‌సారిగా త‌న వ్యూహాన్ని మార్చుకున్నాడు. చంద్ర‌బాబుకు త‌న‌కు పోటీ ఉంటే.. బాబు పాల‌న‌ను అడ్డు పెట్టి.. అవినీతి త‌ప్ప‌ అభివృద్ధి లేద‌ని పేర్కొంటూ.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుతో విజ‌యం సాదించాల‌ని జ‌గ‌న్ భావించాడు. అయితే, ఇప్పుడు ప‌వ‌న్ ఎంట్రీతో ఆయ‌న ఏం చేయాల‌నే విష‌యంపై ప్లేట్ మార్చాడు. 


ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌కు ఒంట‌రిగా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే ద‌మ్ములేద‌నే రేంజ్‌లో జ‌గ‌న్ మీడియా క‌థ‌నాలు ప్ర‌చారం చేస్తోంది. బాబు-ప‌వ‌న్ ఒక గూటి ప‌క్షులేన‌ని, ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయం అంతా బాబు కోస‌మేన‌ని... అంటూ జ‌గ‌న్ మీడియా వార్త ల‌ను వెల్లువెత్తిస్తోంది. దీని వెనుక ఉన్న అస‌లు వ్యూహం ప‌వ‌న్ స్థాయిని త‌గ్గించ‌డ‌మే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ప‌వ‌న్‌.. న‌డిరోడ్డుపై చంద్ర‌బాబును తిట్టిపోశాడు. ఆయ‌న వృద్దుడు అయిపోయాడ‌ని, విశ్రాంతి ఇద్దామ‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ప‌వ‌న్‌కు మ‌ధ్య దూరం పెరిగిన విష‌యం తెలిసిందే. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు చేసిన ఏకైక కామెంట్‌ను అడ్డు పెట్టుకుని జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌ను ప్ర‌జ‌ల్లో చుల‌కన చేసేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నాడు. మ‌రి ఇది క‌నుక స‌క్సెస్ అయితే.. ప‌వ‌న్‌కు ఇబ్బందే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టి క‌రిపించ‌డంలో మ‌న‌కు బ‌లం ఎంత ఉంద‌నే క‌న్నా.. ప్ర‌త్య‌ర్థిని ఎంత బ‌ల‌హీనం చేశామ‌నేది కూడా కీల‌కం.. ఇప్పుడు ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ నిరూపిస్తుండ‌డంగ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: