రాజకీయాల్లో మౌనం అవసరమే కానీ అన్ని సందర్భాలలో మాత్రం కాదు. కొన్ని సార్లు వెనువెంటనే రియాక్ట్ కాకపోతే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మీదట‌ స్పందించినా పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. ఇపుడు జనసేనాని పవన్ విషయంలోనూ అదే మౌనం పెద్ద ప్రశ్నగా, అదే సమాధానంగా ఉంది. మరి ఆ మౌనాన్ని సేనాని చేదిస్తారా ...


బాంబు పేల్చిన బాబు:


పవన్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి ఈ మాటలు అని టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద బాంబే పేల్చారు. రాజకీయాల్లో తప్పు లేదు, కాదు కూడా. కానీ ఏపీలో సమీకరణలు వేరుగా ఉన్నాయి. పవన్ ఏడాది క్రితం బాబుకు వ్యతిరేకంగా బయటకు వచ్చి గళం విప్పారు. సొంతంగా రాజకీయం చేస్తూ రేపటి ఎన్నికల్లో మార్పుని తీసుకురావాలనుకుంటున్నారు. టీడీపీకి మద్దతుగా నిలిచి తాను మోసపోయానని చెప్పుకున్నారు. అటువంటిది మళ్ళీ బాబుతో కలిస్తే ఎలా. అసలు దీన్ని ఎవరైనా ఊహించుకుంటారా.


వాయిస్ ఏదీ :


టీడీపీతో జనసేన పొత్తు అన్నది తప్పు అయితే వెంటనే ఆ పార్టీ రియాక్ట్ కావాలి. బాబు ఏ పొత్తు మాటలు అనేసి  ఒక రోజు పై దాటిపోయింది. కానీ జనసేన నుంచి అధికార ప్రతినిధి పార్ధసారధి మాత్రమే పొత్తు ఉండదు అని చెప్పారు, తప్ప బాధ్యతగల వారు ఏమీ మాట్లాడలేదు ఇంతవరకు. అసలు పొత్తులే ఉండవు. మొత్తానికి మొత్తం సీట్లకు మేమే పోటీ చేస్తామని నిన్న కాక మొన్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల  మనోహర్ విశాఖలో చెప్పారు. మరి, ఇపుడు పొత్తులు అంటూ ఏకంగా టీడీపీ అధినేతే బాణం వేస్తే దానికి ఆయనైనా సమాధానం చెప్పాలి కదా. 


పవన్ స్పందిస్తారా :


ఇక పవన్ అమెరికా టూర్లో ఉన్నారు, ఆయన వచ్చాక అయినా దీని మీద సమాధానం ఉంటుందా అన్నది చూడాలి. అసలు పార్టీ మూలానికే  నష్టం తెచ్చే ఇలాంటి విషయాల్లో అధినేత ఎక్కడ ఉన్నా ఆయన పేరు మీద వెంటనే ప్రకటన ఒకటి రావడం రివాజు. మరి ఇంతవరకూ అలా రాకపోవడం, జనసేనలో మౌన వాతావరణం చూస్తూంటే తెర వెనక ఏమినా జరుగుతోందా అన్న అనుమానాలు మాత్రం అందరికీ కలుగుతున్నాయి.
మరి అది ఎలా ఉన్నా రెండు పార్టీల పొత్తులపై  జనంలో రియాక్షం కోసం ఓ ఫీలర్ వదిలారా అన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఐతే ఇక్కడ ఒక్కటి చెప్పుకోవాలి. టీడీపీ కాంగ్రెస్ తో కలిసి తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసింది. రెండు బద్ద విరుద్ధమైన పార్టీలు కలసి రాజకీయం చేయగా లేనిది జనసేన, టీడీపీ కలవడం లో తప్పు ఐతే లేదు, కానీ అది నిజమో కాదో మాత్రం జనసేన నాయకులే చెప్పాలి. అంతవరకూ మౌనం నుంచే ప్రశ్నలూ, సమాధానాలూ వస్తూనే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: